ఫుట్‌బాల్‌ మైదానంలో తొక్కిసలాట.. 174 మంది దుర్మరణం

2 Oct, 2022 07:22 IST|Sakshi

జకర్తా: ఫుట్‌బాల్‌ మైదానంలో తొక్కిసలాట జరిగి 174 మంది దుర్మరణం పాలైన సంఘటన ఇండోనేషియాలో జరిగింది. తూర్పు జావా ప్రావిన్స్‌లో శనివారం రాత్రి నిర్వహించిన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ సందర్భంగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. మరో 180 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పెర్సెబాయ సురబాయ జట్టు చేతిలో అరెమా జట్టు ఓడిపోయింది. ఈ క్రమంలో ఇరుజట్ల అభిమానులు ఘర్షణకు దిగారు.

ఓటమి భరించలేక మైదానంలోకి చొచ్చుకొచ్చారు అరెమా జట్టు అభిమానులు. వారిని నిలువరించేందురు పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించి, లాఠీఛార్జ్‌ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో భయానక పరిస్థితులు తలెత్తాయి. అదే తొక్కిసలాటకు దారి తీసినట్లు ప్రత్యక్ష సాక్ష‍్యులు చెబుతున్నారు. ప్రధాన ద్వారం వైపు పరుగులు పెట్టిన క్రమంలో కిందపడిపోయిన కొందరు ఊపిరాడక మరణించినట్లు చెప్పారు.  ఈ ఘటనపై ఇండోనేషియన్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ ఘోర దుర్ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. మహిళలు, చిన్నారులు సహా 22 మంది మృతి

మరిన్ని వార్తలు