T20 WC 2022: సహనం కోల్పోయిన షాదాబ్‌ ఖాన్‌.. 'కెప్టెన్‌గా పనికిరావు'

18 Oct, 2022 10:48 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం పాకిస్తాన్‌, ఇంగ్లండ్‌ మధ్య జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. వార్మప్‌ మ్యాచ్‌కు పాక్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం దూరంగా ఉండడంతో షాదాబ్‌ ఖాన్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. సాధారణంగా కెప్టెన్‌ అనేవాడు ఎంతో కూల్‌గా ఉంటూ జట్టు సభ్యులను కంట్రోల్‌ చేస్తూ తన ఆటను కొనసాగిస్తాడు. కానీ కెప్టెన్‌ సహనం కోల్పోయి తోటి ఆటగాళ్లపై ఆగ్రహం ప్రదర్శించడం మంచిది కాదు. అయితే షాదాబ్‌ ఖాన్‌ మాత్రం ఒక రనౌట్‌ విషయంలో తోటి ఆటగాడిపై అసహనం ‍వ్యక్తం చేసి ట్రోల్స్‌ బారిన పడ్డాడు. ఒక్క రనౌట్‌కే సహనం కోల్పోతే ఎలా.. ఇలా అయితే కెప్టెన్‌గా పనికిరావు అంటూ కామెంట్‌ చేశారు.

విషయంలోకి వెళితే.. అప్పటికే లియామ్‌ లివింగ్‌స్టోన్‌ మంచి బ్యాటింగ్‌ కనబరుస్తున్నాడు. షాదాబ్‌ ఖాన్‌ వేసిన బంతిని లివింగ్‌స్టోన్‌ ఆఫ్‌సైడ్‌ దిశగా ఆడాడు. లివింగ్‌స్టోన్‌ సింగిల్‌ కోసం నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న హ్యారీ బ్రూక్‌కు కాల్‌ ఇచ్చినప్పటికి పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే బంతి దూరంగా వెళ్లడంతో అప్పుడు స్పందించిన బ్రూక్‌ పరిగెత్తాడు. కానీ అప్పటికే బంతిని అందుకున్న హారిస్‌ రౌఫ్‌ త్రో వేయడంలో విఫలమయ్యాడు. బంతి వికెట్లకు తగిలి ఉంటే లివింగ్‌స్టోన్‌ కచ్చితంగా ఔటయ్యేవాడు. అంతే కోపం కట్టలు తెంచుకున్న షాదాబ్‌ ఖాన్‌ హారిస్‌ రౌఫ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

పాకిస్తాన్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌ ఇంగ్లండ్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన  ఇంగ్లండ్‌ జట్టు 14.4 ఓవర్లలో టార్గెట్‌ను అందుకుంది. హ్యారీ బ్రూక్‌ 45 నాటౌట్‌, లివింగ్‌స్టోన్‌ 35, సామ్‌ కరన్‌ 33 నాటౌట్‌ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ నిర్ణీత 19 ఓవర్లలో( వర్షం అంతరాయం వల్ల ఒక ఓవర్‌ కుదింపు) 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. షాన్‌ మసూద్‌ 39, ఇప్తికర్‌ అహ్మద్‌ 22, మహ్మద్‌ వసీమ్‌ 26 పరుగులు చేశారు.

చదవండి: న్యూజిలాండ్‌తో వార్మప్‌ మ్యాచ్‌.. సూర్యకుమార్‌ దూరం!

>
మరిన్ని వార్తలు