Shadab Khan: పాక్‌ తరపున రెండో బ్యాటర్‌గా..

3 Nov, 2022 16:01 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌కు సౌతాఫ్రికాతో మ్యాచ్‌ చాలా కీలకం. ప్రొటిస్‌తో మ్యాచ్‌లో కచ్చితంగా గెలిస్తేనే సెమీస్‌ అవకాశాలు ఉంటాయి. ఓడితే మాత్రం పాకిస్తాన్‌ ఇంటిబాట పట్టాల్సిందే. ఈ నేపథ్యంలోనే సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో పాకిస్తాన్‌ భారీ స్కోరు చేసింది. 95 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశ నుంచి 185 పరుగులు చేయగలిగింది. పాక్‌ మిడిలార్డర్‌ మహ్మద్‌ నవాజ్‌(28 పరుగులు), ఇప్తికర్‌ అహ్మద్‌(51), షాదాబ్‌ ఖాన్‌(52) చెలరేగారు. ఈ నేపథ్యంలోనే షాదాబ్‌ ఖాన్‌ టి20 క్రికెట్‌లో పాకిస్తాన్‌ జట్టు తరపున అరుదైన ఘనత సాధించాడు.

పాక్‌ తరపున టి20ల్లో అత్యంత తక్కువ బంతుల్లో ఫిఫ్టీ కొట్టిన రెండో బ్యాటర్‌గా షాదాబ్‌ ఖాన్‌ నిలిచాడు. సౌతాఫ్రికాపై 20 బంతుల్లో అర్థసెంచరీ మార్క్‌ అందుకున్న షాదాబ్‌ ఖాన్‌ ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఇక తొలి స్థానంలో షోయబ్‌ మాలిక్‌ ఉన్నాడు. 2021 టి20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో షోయబ్‌ మాలిక్‌ 18 బంతుల్లోనే ఫిప్టీ సాధించాడు.

వీరిద్దరి తర్వాత ఉమర్‌ అక్మల్‌ 2010లో ఆస్ట్రేలియాపై 21 బంతుల్లో అర్థ సెంచరీ మార్క్‌ సాధించి మూడో స్థానంలో ఉన్నాడు. ఇక నాలుగో స్థానంలోనూ ఉమర్‌ అక్మలే ఉన్నాడు. 2016లో న్యూజిలాండ్‌పై 22 బంతుల్లో 50 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. ఇక ఇదే మ్యాచ్‌లో పాకిస్తాన్‌ మరో రెండు రికార్డులు బద్దలు కొట్టింది.

► సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఇప్తికర్‌ అహ్మద్‌-షాబాద్‌ ఖాన్‌ జంట ఆరో వికెట్‌కు 35 బంతుల్లో 82 పరుగులు జోడించారు. టి20 క్రికెట్‌లో పాకిస్తాన్‌కు ఏ జట్టుపై అయినా ఆరో వికెట్‌కు ఇదే అత్యుత్తమం. ఇంతకముందు 2019లో శ్రీలంకపై ఆసిఫ్‌ అలీ- ఇమాద్‌ వసీమ్‌ జంట ఆరో వికెట్‌కు 47 బంతుల్లో 75 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. మిస్పా ఉల్‌ హక్‌- షోయబ్‌ మాలిక్‌ 2012లో ఇంగ్లండ్‌పై ఆరో వికెట్‌కు 56 బంతుల్లో 71 పరుగులు జోడించి మూడో స్థానంలో నిలిచారు.

► ఇక పాకిస్తాన్‌  ఒక టి20 మ్యాచ్‌లో నాలుగు వికెట్లు త్వరగా కోల్పోయిన తర్వాత 142 పరుగులు జోడించడం ఇదే తొలిసారి.

చదవండి: మహ్మద్‌ నవాజ్‌ రనౌటా లేక ఎల్బీనా?

మరిన్ని వార్తలు