5 వికెట్ల‌తో చెల‌రేగాడు.. జ‌ట్టును గెలిపించాడు

4 Feb, 2022 10:21 IST|Sakshi

పాకిస్తాన్ సూప‌ర్ లీగ్‌లో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ 43 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇస్లామాబాద్ యునైటెడ్‌కు ఓపెన‌ర్లు హెల్స్‌, స్టిర్లింగ్ ఘ‌నమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్ద‌రూ తొలి వికెట్‌కు 55 ప‌రుగుల భాగస్వామ్యాన్ని నెల‌కొల్పారు. హెల్స్ ఔట‌య్యాక క్రీజులోకి వ‌చ్చిన మున్రో సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించాడు. అదే విధంగా స్టిర్లింగ్ కూడా ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు. ఇక 58 ప‌రుగులు చేసిన  స్టిర్లింగ్ న‌వాజ్ బౌలింగ్‌లో పెవిలియ‌న్‌కు చేరాడు. అత‌డి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి.

ఆ త‌ర్వాత ఆజామ్ ఖాన్‌, మున్రో స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించారు. మున్రో కేవ‌లం 39 బంతుల్లో 72 ప‌రుగులు చేయ‌గా, ఆజామ్ ఖాన్ 35 బంతుల్లో 65 ప‌రుగులు చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ 229 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక 230 ప‌రుగుల భారీ లక్ష్యంతో బ‌రిలోకి దిగిన క్వెట్టా గ్లాడియేటర్స్ 185 ప‌రుగుల‌కే ఆలౌటైంది. ఇస్లామాబాద్ బౌల‌ర్ల‌లో కెప్టెన్ షాదాబ్ ఖాన్ 5 వికెట్లు ప‌డ‌గొట్టి గ్లాడియేటర్స్‌ను దెబ్బ‌తీయ‌గా, హసన్ అలీ,మహ్మద్ వసీం చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. ఇక గ్లాడియేటర్స్ బ్యాట‌ర్ల‌లో అస‌న్ అలీ(50),న‌వాజ్ (47) ప‌రుగులతో టాప్ స్కోర‌ర్‌లుగా నిలిచారు.

చ‌ద‌వండి: నాపై ప్రేమ చూపించినందుకు ధన్యవాదాలు.. నేను బాగానే ఉన్నా: శిఖర్ ధావన్

మరిన్ని వార్తలు