WPL Auction: లేడీ సెహ్వాగ్‌కు భారీ ధర.. ఎన్ని కోట్లంటే?

13 Feb, 2023 19:36 IST|Sakshi

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ వేలంలో టీమిండియా యువ సంచలనం షఫాలీ వర్మకు జాక్‌పాట్‌ తగిలింది. ఈ వేలంలో లేడీ సెహ్వాగ్‌గా పేరొందిన షఫాలీ వర్మను కొనుగోలు చేయడానికి ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ హోరాహోరీన పోటీపడ్డాయి. ఆఖరికి రూ.2 కోట్ల భారీ ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ షఫాలీని సొంతం చేసుకుంది. షఫాలీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది.

మహిళల టీ20 ప్రపంచకప్‌-2023లో భాగంగా పాకిస్తాన్‌తో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆమె కీలక ఇన్నింగ్స్‌ ఆడింది. ఈ మ్యాచ్‌లో 33 పరుగులు చేసిన షఫాలీ.. భారత విజయంలో తన వంతు పాత్ర పోషించింది. అదే విధంగా  ఈ ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొట్ట తొలి అండర్‌-19 ప్రపంచకప్‌ను కూడా షఫాలీ సారథ్యంలోనే భారత్‌ కైవసం చేసుకుంది.

ఈ టోర్నీ ఆసాంతం షఫాలీ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరించింది. ఇక ఇప్పటివరకు తన కెరీర్‌లో 52 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన షెఫాలీ వర్మ.. 1264 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్‌లలో 5 అర్దసెంచరీలు ఉన్నాయి. అదే విధంగా టీ20 క్రికెట్‌లో 1000 పరుగులు చేసిన అతి  పిన్న వయస్కరాలుగా షెఫాలీ చరిత్ర సృష్టించింది. 

రోడ్రిగ్స్‌కు భారీ ధర..
ఇక ఈ వేలంలో షెఫాలీ వర్మతో పాటు భారత స్టార్‌ క్రికెటర్‌ జెమ్మిమా రోడ్రిగ్స్‌ను రూ. 2.2 కోట్ల భారీ ధరకు ఢిల్లీ క్యాపిటల్స్‌ కొనుగోలు చేసింది. అదే విధంగా ఆస్ట్రేలియా కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ను కూడా రూ1.1కోట్లకు ఢిల్లీ సొంతం చేసుకుంది.
చదవండి: WPL Auction: పాకిస్తాన్‌పై దుమ్మురేపింది.. వేలంలో ఊహించని ధర! ఎంతంటే?

మరిన్ని వార్తలు