షారుక్‌ భాయ్‌ మమ్మల్ని వదల్లేదు.. రోజు ఎంక్వైరీ చేసేవాడు

25 May, 2021 15:40 IST|Sakshi

చెన్నై: కరోనా మహమ్మారి సెగతో ఐపీఎల్‌ 14వ సీజన్‌ను బీసీసీఐ మధ్యలోనే రద్దు చేసిన సంగతి తెలిసిందే. కేకేఆర్‌ ఆటగాళ్లు వరుణ్‌ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌లు ఇద్దరికి కరోనా పాటిటివ్‌గా తేలడంతో ముందు జాగ్రత్త చర్యగా ఇద్దరు ఆటగాళ్లను ఐసోలేషన్‌కు తరలించారు. ఆ తర్వాత సీఎస్‌కే, ఢిల్లీ క్యాపిటల్స్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంచైజీల్లో కూడా కరోనా కలకలం రేపడంతో సీజన్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. తాజాగా సందీప్‌ వారియర్‌ కరోనా నుంచి కోలుకొని ఇంటికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో సందీప్‌ వారియర్‌ కరోనా సమయంలో కేకేఆర్‌ తనతో పాటు వరుణ్‌ చక్రవర్తిని ఎలా చూసుకుందనే దానిపై చెప్పుకొచ్చాడు.

''మాకు కరోనా పాజిటివ్‌ అని తేలగానే చాలా భయపడిపోయాం.అయితే కేకేఆర్‌ యాజమాన్యం మాకు దైర్యం చెప్పింది. మా జట్టు డాక్టర్‌ శ్రీకాంత్‌,  వేన్‌ బెంట్లీ(మేనేజర్‌) ,రాజు  (లాజిస్టిక్స్‌) మాతో పాటే ఉండి మమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నారు. మా ఇద్దరికి నెగెటివ్‌ వచ్చిన తర్వాతే వారు ఇంటికి వెళ్లారు. అంతేగాక కేకేఆర్‌ సహ యజమాని షారుక్‌ ఖాన్‌ మమ్మల్ని వదల్లేదు. మాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతీరోజు మా ఆరోగ్యం గురించి ఎంక్వైరీ చేసేవాడు. షారుక్‌ తన జట్టులో ఎవరైనా ఆటగాడు ఏ విషయంలో బాధపడ్డా అతను ఊరుకోడని.. వారి సమస్యను తీర్చేందుకు ముందుకు వస్తాడని తెలిసింది. ఈ విషయం మాకు ఆనందాన్ని కలిగించింది. అయితే మాకు కరోనా సోకిన మరుసటి రోజే లీగ్‌ వాయిదా పడడంతో కాస్త బాధ వేసింది. ఈ సమయంలో షారుక్‌ మాకు ఫోన్‌ చేసి.. ముందు మీరు త్వరగా కోలుకోండి.. ఈ సీజన్‌ను రద్దు అయిందని బాధపడకండి.. ఒకవేళ నిర్వహించే అవకాశం ఉంటే మీరు ఆడవచ్చు.. ఈ విషయం గురించి మర్చిపోయి రెస్ట్‌ తీసుకోండి అని ఫోన్‌లో చెప్పారు.'' అని సందీప్‌ తెలిపాడు.

కాగా ఐపీఎల్‌ 14వ సీజన్‌లో 29 మ్యాచ్‌లు జరగ్గా.. మరో 31 మ్యాచ్‌లు నిర్వహించాల్సి వచ్చింది. ఇక ఈ సీజన్‌లో కేకేఆర్‌ ప్రదర్శన చెప్పుకునేంత స్థాయిలో లేదు. మోర్గాన్‌ సారధ్యంలోని కేకేఆర్‌ 7 మ్యాచ్‌ల్లో 2 విజయాలు.. 5 ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. అయితే కరోనా కారణంగా రద్దు అయిన సీజన్‌ను సెప్టెంబర్‌- అక్టోబర్‌లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తుంది.
చదవండి: కోహ్లి నన్ను స్లెడ్జ్‌ చేశాడు.. సంతోషం!

ఇంకా పూర్తిగా కోలుకోలేదు: వరుణ్‌ చక్రవర్తి

మరిన్ని వార్తలు