‘రాహుల్‌ పేరు వినే ఉంటారు కదా...’ : షారుఖ్‌

9 Oct, 2020 06:29 IST|Sakshi

త్రిపాఠి గురించి షారుఖ్‌ సరదా వ్యాఖ్య

అబుదాబి: చెన్నైపై అద్భుత ప్రదర్శనతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను గెలిపించిన రాహుల్‌ త్రిపాఠిపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే అన్నింటికి మించి టీమ్‌ యజమాని, బాలీవుడ్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ ప్రోత్సాహం త్రిపాఠి ఆనందాన్ని రెట్టింపు చేసింది. రాహుల్‌ బ్యాటింగ్‌ సమయంలో ఆద్యంతం అతడిని ఉత్సాహపరచిన షారుఖ్‌... ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు అందుకునే సమయంలో కూడా తన అత్యంత పాపులర్‌ డైలాగ్‌ (దిల్‌తో పాగల్‌ హై... సినిమా క్లైమాక్స్‌ సీన్‌)తో అతడిని అభినందించాడు.

‘రాహుల్‌... నామ్‌తో సునాహీ హోగా (రాహుల్‌...ఈ పేరు వినే ఉంటారు కదా’) అని షారుఖ్‌ గట్టిగా అరవడంతో నవ్వులు విరబూశాయి. దీనిపై హర్ష భోగ్లే అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ‘షారుఖ్‌ ముందు ఇంతటి మంచి ప్రదర్శన ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. నా కల నిజమైనట్లు అనిపిస్తోంది’ అని త్రిపాఠి వ్యాఖ్యానించాడు. కేకేఆర్‌ అఫీషియల్‌ ట్విట్టర్‌లో కూడా రెండు చేతులూ వెడల్పుగా చాచిన షారుఖ్‌ పోజులో రాహుల్‌ త్రిపాఠి తన బహుమతులను ప్రదర్శిస్తుండగా ‘ఏ సినిమాలో రాహుల్‌ ఉంటాడో అది కచ్చితంగా సూపర్‌ హిట్‌ అవుతుంది’ అని వ్యాఖ్య పెట్టింది. షారుఖ్‌ సినిమాల్లో ఎక్కువ సార్లు అతని పాత్రకు రాహుల్‌ పేరు ఉండటంతో అది బాగా పాపులర్‌ అయింది.    

(ఆ క్షణం ఎంతో మధురం...)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు