PSL: ఆటగాళ్ల బూతు పురాణం.. వీడియో

16 Jun, 2021 11:07 IST|Sakshi

అబుదాబి: పాకిస్తాన్‌ సూపర్‌లీగ్‌(పీఎస్‌ఎల్-6)లో ఆటగాళ్ల మధ్య బూతు పురాణం చోటుచేసుకుంది. పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, ఫాస్ట్‌ బౌలర్‌ షాహిన్‌ అఫ్రిది పరస్పరం ఒకరినొకరు దూషించుకున్నారు. మంగళవారం క్వెటా గ్లాడియేటర్స్‌, లాహోర్‌ ఖలండర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. క్వెటా గ్లాడియేటర్స్‌ ఇన్నింగ్స్‌ 19వ ఓవర్లో షాహిన్‌ వేసిన బంతి సర్ఫరాజ్‌ హెల్మెట్‌ను తాకుతూ థర్డ్‌మన్‌ దిశగా వెళ్లింది.

అ‍ప్పటికే అంపైర్‌ నోబాల్‌ అని ప్రకటించగా.. సర్ఫరాజ్‌ పరుగు తీసి నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌కు చేరుకున్నాడు. షాహిన్‌ అఫ్రిదిని ఉద్దేశించి.. '' నాకే బౌన్సర్‌ వేస్తావా..'' అన్నట్లుగా కోపంతో చూశాడు. దీంతో బంతి వేయడానికి సిద్ధమవుతున్న అఫ్రిది వెనక్కి వచ్చి సర్ఫరాజ్‌ను తిడుతూ ముందుకు దూసుకొచ్చాడు. అయితే ఇంతలో లాహోర్‌ కెప్టెన్‌ సోహైల్‌ అక్తర్‌, సీనియర్‌ ఆటగాడు మహ్మద్‌ హపీజ్‌ వచ్చి వారిద్దరిని విడదీశారు. ఫీల్డ్‌ అంపైర్లు జోక్యం చేసుకొని ఇద్దరికి సర్ది చెప్పి అక్కడినుంచి పంపించేశారు. ఓవర్‌ ముగిసిన అనంతరం హఫీజ్‌ సర్ఫారజ్‌ దగ్గరికి వచ్చి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఒక సీనియర్‌ ఆటగాడిపై నియంత్రణ కోల్పోయి అఫ్రిది ఇలా చేయడంపై అభిమానుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన క్వెటా గ్లాడియేటర్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నస్టానికి 158 పరుగులు చేసింది. గ్లాడియేటర్స్‌ బ్యాటింగ్‌లో వెథర్‌లాండ్‌ 48 పరుగులతో ఆకట్టుకోగా.. కెప్టెన్‌ సర్ఫరాజ​ 34, అజమ్‌ ఖాన్‌ 33 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లాహోర్‌ ఖలందర్స్‌ 18 ఓవర్లలో140 పరుగులకే ఆలౌట్‌ అయి 18 పరుగులతో ఓటమిని చవిచూసింది.
చదవండి: ప్లీజ్‌ ఇలాంటివి వద్దు.. మంచినీరు మాత్రమే తాగండి: రొనాల్డో

ఆస్పత్రి పాలైన డుప్లెసిస్‌

మరిన్ని వార్తలు