అఫ్రిది కూతురితో షాహిన్‌ అఫ్రిది నిశ్చితార్థం!

7 Mar, 2021 11:51 IST|Sakshi

కరాచీ: పాకిస్తాన్‌ యువ పేసర్‌ షాహిన్‌ అఫ్రిది త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. అయితే అతను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు షాహిద్‌ అఫ్రిది పెద్ద కూతురు అక్సా అఫ్రిది అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇరువురు క్రికెటర్లు ఇంతవరకు స్పందించలేదు. అయితే పాకిస్తానీ లోకల్‌ మీడియా అందించిన వివరాలు ప్రకారం.. షాహిద్‌ అఫ్రిది తండ్రి అయాజ్‌ ఖాన్‌ పెళ్లి విషయమై షాహిద్‌ కుటుంబం వద్ద ప్రస్తావించారని..అందుకు వారు ఒప్పుకున్నట్లుగా సమాచారం. అయితే షాహిన్‌ ఇప్పుడిప్పుడే క్రికెటర్‌గా ఎదుగుతున్నాడని.. మా కూతురు అక్సా ఇంకా చదువుతుందని.. ఇప్పట్లో ఎంగేజ్‌మెంట్‌ ప్రస్తావన లేదని ఆఫ్రిది కుటుంబవర్గం తెలిపింది. అయితే వచ్చే రెండేళ్లలో మాత్రం వీరిద్దరి పెళ్లి జరిగే అవకాశం ఉందని తెలిపారు.

ఇవన్నీ ఒట్టి పుకార్లేనని.. వారి కుటుంబాల మధ్య పెళ్లికి సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదంటూ ట్విటర్లో వార్తలు వచ్చాయి. దీనిపై పాకిస్తానీ జర్నలిస్ట్‌ ఇతిషామ్‌ ఉల్‌ హక్‌ స్పందిస్తూ.. ‘షాహిన్‌ ఆఫ్రిది, అక్సా అఫ్రిది నిశ్చితార్థం నిజమే.. రూమర్లు కాదని.. ఇరు కుటుంబాలు ఇ‍ప్పటికే అంగీకరించాయి. త్వరలోనే వీరి నిశ్చితార్థం జరగనుంది. అయితే పెళ్లి మాత్రం అక్సా చదువు పూర్తయిన తర్వాత జరగనుంది’ అంటూ క్లారిటీ ఇచ్చాడు. కాగా షాహిన్‌ అఫ్రిదితో మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది పాకిస్తాన్‌ సూపర్‌లీగ్‌లో ఆడుతున్న సంగతి తెలిసిందే. షాహిన్‌ లాహోర్‌ క్యూలాండర్స్‌కు.. షాహిద్‌ అఫ్రిది ముల్తాన్‌ సుల్తాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా షాహిన్‌ లీగ్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టాడు.

చదవండి: 
వారు సహకరిస్తే బాగుండు.. సుందర్‌ తండ్రి ఎమోషనల్‌

దేవుడా.. పెద్ద గండం తప్పింది

మరిన్ని వార్తలు