Asia Cup 2022: త్రివర్ణ పతాకంతో ఆఫ్రిది కూతురు.. నిజమేనన్న పాక్‌ మాజీ ఆల్‌రౌం‍డర్‌

13 Sep, 2022 11:17 IST|Sakshi

ఆసియా కప్‌-2022లో భాగంగా భారత్‌-పాక్‌ల మధ్య జరిగిన సూపర్‌-4 దశ మ్యాచ్‌ సందర్భంగా పాకిస్తాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది చిన్ని కూతురు భారత జెండా ఊపుతూ కనిపించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. ఈ విషయమై ఓ టీవీ ఇంటర్వ్యూ సందర్భంగా అఫ్రిదిని ప్రశ్నించగా అతను చెప్పిన సమాధానం విని అందరూ షాకయ్యారు. ఈ విషయంపై లైవ్‌లో జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు అఫ్రిది పెద్దగా నవ్వుతూ సమాధానం చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. 

అవును నా కూతురు భారత జెండా పట్టుకుంది.. ఆ వీడియోలు నా దగ్గర కూడా ఉన్నాయి. పాపతో ఉన్న నా భార్య కూడా ఈ విషయాన్ని చెప్పింది. ఆ రోజు (భారత్‌-పాక్‌ మ్యాచ్‌ జరిగిన రోజు) స్టేడియంలో 90 శాతం మంది భారత అభిమానులు, కేవలం 10 శాతం మంది పాక్‌ ఫ్యాన్స్‌ ఉన్నారు. స్టేడియం వద్ద పాక్‌ జాతీయ జెండాలు దొరక్కపోవడంతో మా పాప భారత జెండాను పట్టుకుంది. 

ఫైనల్లో పాక్‌పై శ్రీలంక గెలిచిన అనంతరం గంభీర్‌ కూడా శ్రీలంక జెండా ఊపాడు. అలా చేసినంత మాత్రనా అతను శ్రీలంకన్‌ అయిపోయాడా.. లేక అతన్ని శ్రీలంక అభిమాని అని అనాలా..? అంటూ ఈ విషయాన్ని రచ్చ చేయవద్దని జర్నలిస్ట్‌ను కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. 

కాగా, ఆసియా కప్‌లో భారత్‌, పాక్‌లు రెండు సందర్భాల్లో ఎదురెదురు పడగా.. గ్రూప్‌ దశలో టీమిండియా, సూపర్‌-4 దశలో పాక్‌లు గెలుపొందాయి. సూపర్‌-4 దశలో భారత్‌.. పాక్‌, శ్రీలంక చేతుల్లో వరుస పరాజయాలు ఎదుర్కోవడంతో ఫైనల్‌కు చేరకుండానే నిష్క్రమించింది. ఫైనల్లో శ్రీలంక, పాక్‌లు తలపడగా.. లంకేయులు పాక్‌ను మట్టికరిపించి ఆరో సారి ఆసియా ఛాంపియన్లుగా నిలిచారు. 

మరిన్ని వార్తలు