Mega Star League: కొత్త క్రికెట్‌ లీగ్‌ను ప్రారంభించిన షాహిద్‌ అఫ్రిది

26 Apr, 2022 16:22 IST|Sakshi

Shahid Afridi Launches Mega Star League: పాకిస్థాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది క్రికెట్‌ ప్రేమికులకు శుభవార్త చెప్పాడు. మెగా స్టార్ లీగ్ (ఎమ్‌ఎస్‌ఎల్) పేరుతో త్వరలో సరికొత్త క్రికెట్ టోర్నీని ప్రారంభించనున్నట్లు వెల్లడించాడు. ముస్తాక్ అహ్మద్, ఇంజమామ్ ఉల్ హక్, వకార్ యూనిస్ తదితర పాక్ మాజీ క్రికెటర్లను కలుపుకుని లీగ్‌ను ప్రారంభించేందుకు సన్నాహకాలు మొదలుపెట్డాడు. 


ఈ లీగ్‌లో పాకిస్థాన్‌ మాజీలతో పాటు పలువురు అంతర్జాతీయ మాజీ క్రికెటర్లు,  చలన చిత్ర, సంగీత రంగానికి చెందిన సెలబ్రిటీలు పాల్గొంటారని తెలిపాడు. ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న మాజీ క్రికెటర్లు, అథ్లెట్లు, జర్నలిస్టులకు చేయూతనిచ్చేందుకు ఈ లీగ్‌ను ప్రారంభించబోతున్నట్లు వెల్లడించాడు. పాకిస్థాన్‌లోని రావల్పిండి వేదిగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో మెగా స్టార్ లీగ్ ప్రారంభమవుతుందని ప్రకటించాడు. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయని పేర్కొన్నాడు.

పాక్‌ తరఫున 27 టెస్టులు, 398 వన్డేలు, 99 టీ20లు ఆడిన షాహిద్ ఆఫ్రిది 2018లో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలిగాడు. అనంతరం అతను కొంతకాలం పాటు పాక్ సూపర్ లీగ్‌, బిగ్‌బాష్ లీగ్‌, శ్రీలంక ప్రీమియర్ లీగ్, టీ20 బ్లాస్ట్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్, ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ వంటి ఫ్రాంఛైజీ లీగ్‌ల్లో పాల్గొన్నాడు. అఫ్రిది భారత్‌ వేదికగా జరిగే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో కూడా ఆడాడు. 2008 ఐపీఎల్‌ ప్రారంభ ఎడిషన్‌లో అతను డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 37 బంతుల్లోనే వన్డే సెంచరీ సాధించడం ద్వారా అఫ్రిది తొలిసారి వార్తల్లోకెక్కాడు. 
చదవండి: ధోని తలా, కోహ్లి కింగ్‌ అయితే శిఖర్‌ టీ20 ఖలీఫా..!
 

మరిన్ని వార్తలు