Shahid Afridi: షాహిద్‌ అఫ్రిదికి పీసీబీలో కీలక బాధ్యతలు

24 Dec, 2022 17:04 IST|Sakshi

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) చీఫ్‌ సెలెక్టర్‌గా మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది ఎంపికయ్యాడు. ఇటీవలే సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌ అయిన పాకిస్తాన్‌ దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ సిరీస్‌ ఓటమి పీసీబీ ప్రక్షాళనకు దారి తీసింది. పీసీబీ ఛైర్మన్‌గా ఉన్న రమీజ్‌ రాజాపై వేటు పడిన సంగతి తెలిసిందే. అతని స్థానంలో నజమ్‌ సేతీ కొత్త ఛైర్మన్‌గా ఎంపికయ్యాడు.

తాను ఎంపికైన రెండురోజులకే పీసీబీలో కీలక మార్పులు చేపట్టాడు నజమ్‌ సేతీ. పాక్‌ క్రికెట్‌లో కీలకపాత్ర పోషించిన ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిదిని చీఫ్‌ సెలెక్టర్‌ పదవికి ఎంపిక చేశాడు. అఫ్రిదితో పాటు మాజీ ఆల్‌రౌండర్‌ అబ్దుల్‌ రజాక్‌, మాజీ క్రికెటర్‌ ఇఫ్తికార్‌ అంజుమ్‌లు ప్యానెల్‌లో సభ్యులుగా ఎంపికవ్వగా.. హరూన్‌ రషీద్‌ కన్వీనర్‌గా ఎంపికయ్యాడు. ఈ మేరకు పీసీబీ తన ట్విటర్‌లో ప్రకటన విడుదల చేసింది.

ప్రస్తుతం పీసీబీలో ప్రక్షాళన జరుగుతుంది. త్వరలోనే పాక్‌ జట్టులోనూ ఆటగాళ్ల ప్రక్షాళన జరిగే అవకాశం ఉంది. బాబర్‌ ఆజంను త్వరలోనే కెప్టెన్సీ నుంచి తప్పించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక పీసీబీ చీఫ్‌ సెలెక్టర్‌గా ఎంపికైన షాహిద్‌ అఫ్రిది పాక్‌ తరపున అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా పేరు పొందాడు.

22 ఏళ్ల లాంగ్‌ కెరీర్‌లో అఫ్రిది 27 టెస్టులు, 398 వన్డేలు, 99 టి20 మ్యాచ్లు ఆడాడు. 2009 టి20 వరల్డ్‌కప్‌ నెగ్గిన పాకిస్తాన్‌ జట్టులో అఫ్రిది సభ్యుడిగా ఉన్నాడు. ఇక అబ్దుల్‌ రజాక్‌ కూడా పాక్‌ తరపున మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. 1996 నుంచి 2013 వరకు పాక్‌కు ప్రాతినిధ్యం వహించిన అబ్దుల్‌ రజాక్‌ 46 టెస్టులు, 265 వన్డేలు, 32 టి20 మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఇఫ్తికర్‌ అంజూమ్‌ పాక్‌ తరపున 62 మ్యాచ్‌ల్లో 77 వికెట్లు పడగొట్టాడు. 

>
మరిన్ని వార్తలు