పీఎస్‌ఎల్‌ నుంచి అఫ్రిది ఔట్‌.. కారణం అదే

25 May, 2021 22:00 IST|Sakshi

కరాచీ: కరోనా కారణంగా వాయిదా పడిన పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ వచ్చే నెలలో అబుదాబి వేదికగా జరగనుంది. కాగా లీగ్‌లో జరగనున్న మిగిలన​ మ్యాచ్​లకు స్టార్‌ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది దూరమయ్యాడు. వెన్నునొప్పి కారణంగా అఫ్రిది లీగ్‌ నుంచి తప్పుకున్నట్లు పాకిస్తాన్‌ క్రికెట్ బోర్డు వెల్లడించింది. వచ్చే నెలలో అబుదాబిలో పీఎస్‌ఎల్‌ తిరిగి ప్రారంభంకానుంది. 

గత మార్చిలో 20 మ్యాచ్‌లు జరిగిన తర్వాత వాయిదా పడింది. ఆరు ఫ్రాంచైజీలలోని చాలా మంది ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కరోనా బారినపడటంతో లీగ్‌ను అర్ధంతరంగా వాయిదా వేశారు. అఫ్రిది ముల్తాన్‌ సుల్తాన్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తీవ్రమైన నడుము నొప్పి కారణంగా డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు షాహిద్‌ తెలిపాడు.


ఇక దిగ్గజ ఆల్‌రౌండర్‌గా గుర్తింపుపొందిన షాహిద్‌ అఫ్రిది పీఎస్‌ఎల్‌లో ముల్తాన్‌ సుల్తాన్స్‌కు ముందు కరాచీ కింగ్స్‌, పెషావర్‌ జల్మీకి ప్రాతినిధ్యం వహించాడు. 50 మ్యాచ్‌ల్లో 44 వికెట్లతో పాటు 465 పరుగులు సాధించాడు. అంతర్జాతీయంగా చూసుకుంటే పాక్‌ తరపున అఫ్రిది 27 టెస్టుల్లో 1716 పరుగులు.. 48వికెట్లు , 398 వన్డేల్లో 8064 పరుగులు.. 395 వికెట్లు , 99 టీ20ల్లో 1416 పరుగులు.. 98 వికెట్లు తీశాడు.
చదవండి: ఆ క్రికెటర్‌తోనే నా కూతురు పెళ్లి: పాక్‌ మాజీ క్రికెటర్‌

'నేను జోక్‌ చేశా.. అక్తర్‌ సీరియస్‌ అ‍య్యాడు'

మరిన్ని వార్తలు