శైలీ 6.40 మీటర్ల జంప్‌

21 Aug, 2021 01:47 IST|Sakshi

లాంగ్‌జంప్‌ ఫైనల్‌కు అర్హత సాధించిన భారత అథ్లెట్‌

నైరోబీ: వరల్డ్‌ జూనియర్‌ (అండర్‌–20) అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత ప్లేయర్‌ శైలీ సింగ్‌ సత్తా చాటింది. మహిళల లాంగ్‌ జంప్‌లో ఆమె ఫైనల్‌కు అర్హత సాధించింది. శైలీ తన మూడో ప్రయత్నంలో 6.40 మీటర్లు దూకింది. అధికారిక ఆటోమెటిక్‌ క్వాలిఫయింగ్‌ మార్క్‌ 6.35 మీటర్లు కావడంతో ఆమె నేరుగా ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన శైలీ ప్రతిభను గుర్తించి భారత దిగ్గజం అంజూ బాబీ జార్జ్‌ ఆమెను తన అకాడమీలో సానబెట్టింది. ప్రస్తుతం శైలి బెంగళూరులోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) కేంద్రంలో శిక్షణ పొందుతోంది. ఆదివారం ఈ భారత అథ్లెట్‌ ఫైనల్‌ బరిలోకి దిగనుంది.  

 పురుషుల జావెలిన్‌ త్రోలో మన జట్టుకు ఆశించిన ఫలితాలు రాలేదు. ఫైనల్‌కు చేరిన ఆశలు రేపిన భారత త్రోయర్లు అజయ్‌ రాజ్‌ సింగ్, జై కుమార్‌ వరుసగా 5, 6 స్థానాల్లో నిలిచారు. అజయ్‌ 73.68 మీటర్లు త్రో విసరగా, జై కుమార్‌ జావెలిన్‌ 70.74 మీటర్ల వరకు వెళ్లింది. పురుషుల 300 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో సునీల్‌ జోలియా (9 నిమిషాల 49.23 సెకన్లు) ఓవరాల్‌గా 22వ స్థానంలో, పురుషుల 110 మీటర్ల హర్డిల్స్‌లో తేజస్‌ శిర్సే ఓవరాల్‌గా 17వ స్థానంలో నిలిచి నిష్క్రమించారు. మహిళల 1500 మీటర్ల పరుగులో పూజ హీట్‌ 1లో 11వ స్థానానికే పరిమితమై ముందంజ వేయలేకపోయింది.

నందిని, శ్రీనివాస్‌లకు నిరాశ
వరల్డ్‌ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలుగు రాష్ట్రాల అథ్లెట్లు దురదృష్టవశాత్తూ ముందంజ వేయలేకపోయారు. అగసార నందిని (తెలంగాణ) మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో సెమీ ఫైనల్లో నిష్క్రమించింది. 14.16 సెకన్లలో పరుగు పూర్తి చేసిన నందిన సెమీస్‌ (హీట్‌ 2)లో  ఆరో స్థానంతో ముగించింది. అంతకుముందు హీట్స్‌లో నాలుగో స్థానంలో నిలిచి నందిని సెమీస్‌కు అర్హత సాధించింది. పురుషుల 200 మీటర్ల పరుగులో నలుబోతు షణ్ముగ శ్రీనివాస్‌ (ఆంధ్రప్రదేశ్‌) క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగాడు. 21.33 సెకన్ల టైమింగ్‌ నమోదు చేసిన అతను హీట్స్‌లో ఐదో స్థానంలో నిలిచాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు