Shakib Al Hasan: అరుదైన ఫీట్‌తో చరిత్రకెక్కిన బంగ్లా కెప్టెన్‌

18 Mar, 2023 21:52 IST|Sakshi

బంగ్లాదేశ్‌ కెప్టెన్‌.. ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ వన్డేల్లో కొత్త చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో ఏడువేల పరుగులతో పాటు 300 వికెట్లు తీసిన మూడో క్రికెట్‌ర్‌గా రికార్డులకెక్కాడు. శనివారం ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో 24 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షకీబ్‌ ఈ ఫీట్‌ అందుకున్నాడు. 

లంక దిగ్గజం సనత్‌ జయసూర్య, పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు షాహిద్‌ అఫ్రిది తర్వాత ఆల్‌రౌండర్‌గా షకీబ్‌ వన్డేల్లో ఏడు వేల పరుగులతో పాటు 300 వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. ఇక బంగ్లాదేశ్‌ తరపున వన్డేల్లో అత్యధిక పరుగుల చేసిన జాబితాలో షకీబ్‌ రెండో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం బంగ్లా ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ 8146 పరుగులతో  తొలి స్థానంలో ఉన్నాడు.

ఇక ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా షకీబ్‌ వన్డేల్లో 300 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. రియాన్‌ అహ్మద్‌ వికెట్‌ ద్వారా ఈ ఫీట్‌ సాధించిన షకీబ్‌.. జయసూర్య, వెటోరి తర్వాత 300 వికెట్ల మార్క్‌ అందుకున్న మూడో లెఫ్టార్మ్‌ బౌలర్‌గా నిలిచాడు. ఇక బంగ్లాదేశ్‌ తరపున వన్డేలు, టెస్టులు, టి20లు కలిపి లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా కొనసాగుతున్నాడు. షకీబ్‌ వన్డేల్లో 300 వికెట్లు, టెస్టుల్లో 231 వికెట్లు, టి20ల్లో 128 వికెట్లు తీశాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే బంగ్లాదేశ్‌ ఐర్లాండ్‌పై 183 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. షకీబ్‌ 93, తౌఫిర్‌ హృదోయ్‌ 92 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ 155 పరుగులకే కుప్పకూలింది.

చదవండి: బంగ్లా జోరు.. తమ వన్డే చరిత్రలో అత్యంత పెద్ద విజయం

మరిన్ని వార్తలు