Asia Cup 2022: బంగ్లాదేశ్‌ కెప్టెన్‌గా షకీబ్‌ ఆల్‌ హసన్‌..

13 Aug, 2022 19:17 IST|Sakshi

బంగ్లాదేశ్‌ టీ20 కెప్టెన్‌గా ఆ జట్టు స్టార్‌ ఆల్‌ రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌  ఎంపికయ్యాడు. ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌ వరకు బంగ్లా జట్టు కెప్టెన్‌గా షకీబ్‌ వ్యవహరించనున్నాడని ఆ దేశ క్రికెట్‌ బోర్డు శనివారం ప్రకటించింది. కాగా జింబాబ్వే పర్యటనకు ముందు బంగ్లాదేశ్‌ టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహ్మదుల్లా తప్పుకున్నాడు. దీంతో అతడి స్థానంలో తాత్కాలిక సారథిగా వికెట్‌ కీపర్‌ నూరల్‌ హసన్‌ను బీసిబీ నియమించింది.

అయితే జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో నూరల్‌ హసన్‌ చేతి వేలికి గాయమైంది. అనంతరం అతడికి సింగపూర్‌లో సర్జరీ నిర్వహించారు. కాగా అతడు గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు రెండు వారాల సమయం పట్టనున్నట్లు బీసిబీ వైద్య బృందం తెలిపింది. ఈ క్రమంలో అతడు త్వరలో జరగనున్న ఆసియాకప్‌కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే షకీబ్‌ను తమ కెప్టెన్‌గా  నియమిస్తూ బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది. కాగా షకీబ్‌ అల్‌ హసన్‌ 'బెట్‌విన్నర్‌ న్యూస్‌’ అనే బెట్టింగ్‌ సంస్థతో ఒప్పందం కుదర్చుకుని వివాదంలో చిక్కున్నాడు. ఈ క్రమంలో ఆ సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేసుకోకపోతే బోర్డు కాంట్రాక్ట్‌ రద్దు చేయడంతో పాటు నిషేధం విధిస్తామని షకీబ్‌ను బంగ్లా క్రికెట్‌ బోర్డు హెచ్చరించింది. దీంతో అతడు వెనుక్కి తగ్గి ఒప్పందం రద్దు చేసుకున్నాడు. దీంతో అతడిపై బంగ్లా క్రికెట్‌ బోర్డు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
చదవండి: IND vs PAK: మ్యాచ్‌కు 15 రోజులుంది.. అప్పుడే జోస్యం చెప్పిన పాంటింగ్‌

మరిన్ని వార్తలు