Shakib Al Hasan: నాకు ఆ స్థాయి ఉందంటారా? పాపం.. పుండు మీద కారం చల్లినట్లు ఏంటది?

3 Nov, 2022 11:16 IST|Sakshi

ICC Mens T20 World Cup 2022- India vs Bangladesh: టీమిండియా విధించిన భారీ లక్ష్యాన్ని బంగ్లాదేశ్‌ ఛేదిస్తుందా? లిటన్‌ దాస్‌ జోరు చూస్తుంటే అది ఖాయంగానే కనిపించింది.. ఇంతలో వరణుడు సీన్‌లోకి వచ్చేశాడు.. ఇరు జట్లు, అభిమానుల్లో టెన్షన్‌ టెన్షన్‌... అయితే, అప్పటికే డక్‌వర్త్‌ లూయీస్‌ మెథడ్‌ ప్రకారం 17 పరుగులతో ముందంజలో ఉన్న బంగ్లా శిబిరంలో సంతోషం.. 

కాసేపటికి వర్షం ఆగింది.. ఆట మొదలైంది.. 16 ఓవర్లలో 151 పరుగుల సమీకరణం.. 54 బంతుల్లో 85 పరుగులు చేయాలి.. అప్పటికింకా ఒక్క వికెట్‌ కూడా పడకపోవడంతో గెలుపుపై షకీబ్‌ అల్‌ హసన్‌ బృందం ధీమా.. కానీ లిటన్‌ దాస్‌ రనౌట్‌తో సీన్‌ రివర్స్‌.. అయినా ఆత్మవిశ్వాసంతో మ్యాచ్‌ను ఆఖరి బంతి వరకు తీసుకురాగలిగింది.. 

అయితే, భారత యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ ఒత్తిడిని జయించి నూరుల్‌ హసన్‌ను కట్టడి చేయడంతో 5 పరుగుల తేడాతో టీమిండియా విజయం. ఇలాంటి నాటకీయ పరిణామాల మధ్య చేదు అనుభవాన్ని మూటగట్టుకున్న బంగ్లాదేశ్‌ సెమీస్‌ రేసులో నిలవాలంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి.

అంపైర్లతో నదుల గురించి మాట్లాడావా షకీబ్‌!
ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లాడిన బంగ్లా కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌కు ఓ రిపోర్టర్‌ సంధించిన ప్రశ్నలు.. అందుకు అతడు స్పందించిన విధానం ఆసక్తికరంగా మారింది. ఆ సంభాషణ ఇలా సాగింది.

రిపోర్టర్‌: ‘‘బ్యాడ్‌లక్‌ షకీబ్‌.. వర్షం ఆగిన తర్వాత మీరు బ్యాటింగ్‌ చేయాలని అనుకోలేదా? అంపైర్‌తో మీరు ఏం చర్చించారు?
షకీబ్‌ అల్‌ హసన్‌: ‘‘అంతకంటే మాకు వేరే ఆప్షన్‌ ఉందా?’’

రిపోర్టర్‌: ‘‘అవును.. వేరే ఆప్షన్‌ ఏమీ లేదు. కానీ వాళ్లను కన్విన్స్‌ చేయాలని ప్రయత్నించారా?’’
షకీబ్‌: ‘‘ఎవరిని?’’

రిపోర్టర్‌: ‘‘అంపైర్‌, రోహిత్‌ శర్మను’’
షకీబ్‌: ‘‘నాకు అంపైర్‌ను కన్విన్స్‌ చేయగల స్థాయి ఉందంటారా?’’

ఏంటీ?
రిపోర్టర్: ‘‘మరి అంపైర్‌తో మీరేం మాట్లాడారు? బంగ్లాదేశ్‌లో ఉన్న నదుల గురించి చర్చించారా?’’
షకీబ్‌: ‘‘ఏంటీ?’’

రిపోర్టర్‌: ‘‘బంగ్లాదేశ్‌లో ఉన్న నదులు.. దేశ అభివృద్ధిలో వాటి పాత్ర గురించి మాట్లాడారా అంటున్నా.. దయచేసి మీరు అంపైర్‌తో ఏం మాట్లాడారో వివరించగలరా?’’
షకీబ్‌: ‘‘అవునా.. ఇప్పుడు మీరు సరైన ప్రశ్నే అడిగారు.. అంపైర్‌ ఇరు జట్ల కెప్టెన్లను పిలిచాడు. టార్గెట్‌ ఎంత? రూల్స్‌ ఏమిటి? అన్న విషయాల గురించి చెప్పారు’’

అవును
రిపోర్టర్‌: ‘‘వాటికి మీరు అంగీకరించారా’’
షకీబ్‌: ‘‘అవును’’
రిపోర్టర్‌: ‘‘బ్యూటిఫుల్‌.. థాంక్యూ’’.

పుండుమీద కారం చల్లినట్లుగా
వీరిద్దరి సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘పుండుమీద కారం చల్లినట్లుగా.. పాపం.. అసలే ఓడిన బాధలో ఉన్న షకీబ్‌ను ఆ రిపోర్టర్‌ ఎవరో బాగా ఆడుకున్నట్టున్నాడుగా..’’ అని కొంతమంది వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

మరికొందరు మాత్రం.. ‘‘అసలే టీమిండియా.. అయినా బెదరలేదు.. ఆఖరి బంతి వరకు మ్యాచ్‌ను తీసుకురాగలిగారు.. వర్షం లేకపోయి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది కదా! ఏదేమైనా ఆటలో గెలుపోటములు సహజమే’’ అంటూ షకీబ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.

చదవండి: T20 WC 2022: అంతన్నావు.. ఇంతన్నావు! ఇప్పుడు ఏమైంది షకీబ్‌?
T20 WC 2022: షకీబ్‌ అల్‌ హసన్ అరుదైన ఘనత.. ప్రపంచ రికార్డు సమం

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు