Mohammed Shami: షమీకి ఏడాదికి రూ. 7 కోట్లు! నెలకు 10 లక్షల భరణం ఇవ్వలేరా? కోర్టు కీలక ఆదేశాలు

24 Jan, 2023 12:50 IST|Sakshi
హసీన్‌ జహాన్‌తో షమీ (పాత ఫొటో)

Mohammed Shami- Hasin Jahan: టీమిండియా సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీకి కోల్‌కతా కోర్టులో కాస్త ఊరట లభించింది. తన నుంచి విడిగా ఉంటున్న భార్య హసీన్‌ జహాన్‌కు షమీ ప్రతినెలా లక్షా ముప్పై వేల భరణం చెల్లించాల్సిందిగా ఆదేశించింది. ఇందులో హసీన్‌ తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం 50 వేలు, తమ కుమార్తె అవసరాల కోసం 80 వేలు​ వాడుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. 

10 లక్షలు కావాలి..
కాగా షమీపై సంచలన ఆరోపణలు చేసిన హసీన్‌ జహాన్‌ ప్రస్తుతం తమ కుమార్తెతో కలిసి.. అతడి నుంచి విడిగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనకు నెలవారీ భరణంగా 10 లక్షల రూపాయలు చెల్లించాలని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అందులో తన అవసరాల కోసం 7 లక్షలు వాడుకొంటానని.. మిగిలి మొత్తం తమ కుమార్తె పోషణ, భవిష్యత్తుకై ఖర్చు చేస్తానని పేర్కొంది.

ఏడు కోట్లు ఆర్జించాడు..
ఈ విషయం గురించి ఆమె తరఫు లాయర్‌ మ్రిగాంక మిస్త్రీ కోర్టుకు వివరిస్తూ.. బీసీసీఐ కాంట్రాక్ట్‌ ప్లేయర్‌ అయిన ఏడాదికి షమీ సుమారు ఏడు కోట్ల రూపాయల మేర ఆర్జించాడని.. కాబట్టి ఈ మాత్రం భరణం కోరడంలో తప్పులేదని న్యాయస్థానానికి విన్నవించారు.

అయితే, ఇందుకు బదులుగా షమీ తరఫు న్యాయవాది సలీమ్‌ రెహ్మాన్‌.. హసీన్‌ ప్రొఫెషనల్‌ ఫ్యాషన్‌ మోడల్‌ అని, ఆమెకు ఇదొక ప్రధాన ఆదాయ వనరు అని పేర్కొన్నారు. కాబట్టి ఇంత భారీ మొత్తంలో భరణం డిమాండ్‌ చేయడం అన్యాయమంటూ తన వాదనలు వినిపించారు. 

ఇకపై నెలనెలా
ఈ క్రమంలో ఇరు వర్గాల వాదనలు విన్న కోల్‌కతా కోర్టు.. సోమవారం ఈ మేరకు తీర్పునిచ్చింది. షమీ నెలనెలా హసీన్‌కు 1.30 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ఇందుకు స్పందనగా కోర్టుకు ధన్యవాదాలు తెలియజేసిన హసీన్‌.. తాను అనుకున్న మేర భరణం వస్తే తన జీవితం మరింత సాఫీగా సాగిపోయేదని వ్యాఖ్యానించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇదిలా ఉంటే.. షమీ ప్రస్తుతం స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌తో బిజీగా ఉన్నాడు. 

 షమీకి, హసీన్‌ జహాన్‌కు 2014లో పెళ్లయింది. వీరికి ఒక పాప కూడా ఉంది. మోడల్‌ అయిన హసీన్‌ వస్త్రధారణ వంటి విషయాల్లో అనేక సార్లు షమీ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ ఆమెకు మద్దతుగా నిలిచేవాడు. అయితే, షమీ కుటుంబం తనను హింసిస్తోందని, తన భర్త స్త్రీలోలుడు అంటూ సంచలన ఆరోపణలు చేసిన హసీన్‌ ప్రస్తుతం అతడికి దూరంగా ఉంటోంది.

గ్రేడ్‌-ఎ జాబితాలో
అయితే, హసీన్‌ ఆరోపణల నేపథ్యంలో 2018లో బీసీసీఐ ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్‌లలో షమీకి చోటు దక్కలేదు. చివరి నిమిషంలో అతని పేరును జాబితా నుంచి తప్పించినట్లు బోర్డు వర్గాలు అప్పట్లో వెల్లడించాయి. అయితే, ఇక బీసీసీఐ కాంట్రాక్ట్‌- 2022 వివరాల ప్రకారం.. షమీ గ్రేడ్‌-ఎ జాబితాలో ఉన్నాడు. దీంతో అతడికి ఏడాదికి రూ. 5 కోట్ల మేర రెమ్యునరేషన్‌ అందుతోంది. 

చదవండి: Rohit Sharma: రోహిత్‌ కెరీర్‌ను మలుపు తిప్పిన ధోని నిర్ణయం.. దశాబ్ద కాలంగా.. సూపర్‌ ‘హిట్టు’!
KL Rahul- Athiya Shetty: చూడచక్కని జంట.. దిష్టి తగలకూడదు! కోహ్లి, సూర్య విషెస్‌! రిసెప్షన్‌ ఎప్పుడంటే..

మరిన్ని వార్తలు