BGT 2023: తొలి ఓవర్లోనే షమీకి చేదు అనుభవం.. తర్వాత అద్భుత డెలివరీతో! దెబ్బకు..

9 Mar, 2023 14:27 IST|Sakshi
లబుషేన్‌ను బౌల్డ్‌ చేసిన షమీ (PC: BCCI)

India vs Australia, 4th Test: ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టుతో జట్టులోకి తిరిగి వచ్చిన టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీకి మొదటి ఓవర్లోనే చేదు అనుభవం ఎదురైంది. వైడ్‌తో బౌలింగ్‌ అటాక్‌ ఆరంభించిన షమీ.. తొలి ఓవర్లో మొత్తం 10 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక తన రెండో ఓవర్లోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. మూడో ఓవర్లో ఓ నోబాల్‌!

ఈ క్రమంలో స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ చేతికి బంతినిచ్చాడు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ. వికెట్‌ తీయడానికి వీళ్లిద్దరు కూడా విఫలయత్నం చేశారు. డ్రింక్స్‌ బ్రేక్‌ తర్వాత.. 15.3 ఓవర్లో అశ్విన్‌ ఎట్టకేలకు ట్రవిస్‌ హెడ్‌ను అవుట్‌ చేయగలిగాడు. దీంతో ఆసీస్‌ తొలి వికెట్‌ కోల్పోయింది.

ఆ తర్వాత చాలా సేపటికి షమీకి మరోసారి బౌలింగ్‌ చేసే అవకాశం లభించింది. ఈ క్రమంలో 23వ ఓవర్‌లో అద్భుత డెలివరీతో మార్నస్‌ లబుషేన్‌ను బోల్తా కొట్టించాడు. కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ లబుషేన్‌ను అద్భుత రీతిలో బౌల్డ్‌ చేశాడు. షమీ దెబ్బకు వికెట్‌ ఎగిరిపడింది. దీంతో మైదానంలో ఒక్కసారిగా కేరింతలు వినిపించాయి.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా అశూ, షమీ తీసిన వికెట్లు మినహా మరెవరూ ప్రభావం చూపలేకపోయారు. దీంతో టీ బ్రేక్‌ సమయానికి 2 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. కాగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023 సిరీస్‌ ఫలితాన్ని తేల్చే నాలుగో టెస్టు అహ్మదాబాద్‌లో గురువారం ఆరంభమైంది. 

చదవండి: IPL 2023: సన్‌రైజర్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. కొత్త కెప్టెన్‌ దూరం! సారథిగా భువీ
PSL 2023: బాబర్‌ ఆజం విధ్వంసకర శతకం.. 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో! వార్నర్‌ రికార్డు సమం

మరిన్ని వార్తలు