బాబర్‌ ఆజమ్‌పై వేటు, పాక్‌ కొత్త కెప్టెన్‌ ఎవరంటే..?

14 Jan, 2023 14:23 IST|Sakshi

స్వదేశంలో వరుస పరాజయాల నేపథ్యంలో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) నాయకత్వ మార్పు చేయాలని డిసైడైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉన్న బాబర్‌ ఆజమ్‌ను దించేసి, అతని స్థానంలో మిడిలార్డర్‌ బ్యాటర్‌ షాన్‌ మసూద్‌కు పట్టం కట్టేందుకు సర్వం సిద్ధమైనట్లు పాక్‌ మీడియాలో కధనాలు ప్రసారమవుతున్నాయి. మరోవైపు వెటరన్‌ వికెట్‌కీపర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ను టెస్ట్‌ కెప్టెన్‌ చేస్తారన్న ప్రచారం​ కూడా జోరుగా సాగుతోంది.

వన్డే, టీ20ల్లో షాన్‌ మసూద్‌కు కెప్టెన్సీ అప్పగించినా.. టెస్ట్‌ల్లో మాత్రం సర్ఫరాజ్‌కు సారధ్య బాధ్యతలు అప్పజెప్పాలని పాక్‌ అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారట. ఈ విషయంపై నజీం నేథీ నేతృత్వంలోని పీసీబీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. పాక్‌ క్రికెట్‌ సర్కిల్స్‌లో మాత్రం రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పాక్‌ మాజీలు, ఆ దేశ క్రికెట్‌ విశ్లేషకులేమో మూడు ఫార్మాట్లలో ముగ్గురు వేర్వేరు కెప్టెన్ల ప్రతిపాదనను తెరపైకి తెచ్చారని సమాచారం. ఏదిఏమైనప్పటికీ పీసీబీ నుంచి అధికారిక ప్రకటన వెలువడేంత వరకు ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. 

కాగా, ఇటీవలి కాలంలో పాక్‌ స్వదేశంలో ఆడిన దాదాపు ప్రతి సిరీస్‌లో ఓటమిపాలైన విషయం తెలిసిందే. తాజాగా న్యూజిలాండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో 1-2 తేడాతో ఓటమిపాలైన పాక్‌.. అంతకుముందు అదే జట్టుతో జరిగిన టెస్ట్‌ సిరీస్‌ను అతికష్టం మీద డ్రా చేసుకోగలిగింది. అంతకుముందు ఇంగ్లండ్‌ చేతిలో 0-3 తేడాతో వైట్‌ వాష్‌ అయిన పాక్‌.. వరల్డ్‌ టెస్ట్‌ ఛాం‍పియన్‌షిప్‌ 2021-23లో భాగంగా స్వదేశంలో జరిగిన ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేకపోయింది.

ఈ నేపథ్యంలోనే పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌పై వేటు అంశం తెరపైకి వచ్చింది. ఇదిలా ఉంటే, పీసీబీ కొద్దికాలం క్రితమే బోర్డు ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. తొలుత అధ్యక్షుడు రమీజ్‌ రజాపై వేటు వేసి నజీం సేథికి బాధ్యతలు అప్పగించిన పీసీబీ.. ఇటీవలే షాహిద్‌ అఫ్రిదిని జాతీయ సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌గా నియమించింది. 

మరిన్ని వార్తలు