Shan Masood: 'అక్క మరణం నా జీవితాన్ని తలకిందులు చేసింది'

18 Sep, 2022 11:43 IST|Sakshi

పాకిస్తాన్‌ సీనియర్‌ క్రికెటర్‌ షాన్‌ మసూద్‌ దాదాపు ఆరు నెలల తర్వాత పాకిస్తాన్‌ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. టెస్టు ఓపెనర్‌గా ముద్రపడిన షాన్‌ మసూద్‌ ఇంతకాలం టెస్టులు, వన్డేలకు మాత్రమే పరిమితమయ్యాడు. తన కెరీర్‌లో ఒక్క టి20 మ్యాచ్‌ ఆడని షాన్‌ మసూద్‌ను పీసీబీ ఏకంగా ప్రతిష్టాత్మక టి20 ప్రపంచకప్‌కు ఎంపికచేసింది.

గాయంతో బాధపడుతున్న ఫఖర్‌ జమాన్‌ స్థానంలో షాన్‌ మసూద్‌ను ఎంపిక చేసింది. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన షాన్‌ మసూద్‌ ఇప్పటివరకు 25 టెస్టులాడి 1378 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, ఆరు అర్థసెంచరీలు ఉండడం విశేషం. కాగా టి20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయడంపై షాన్‌ మసూద్‌ శనివారం స్పందించాడు.

''పాక్‌ జట్టుకు ఆడని కాలంలో చాలా విషయాలు తెలుసుకున్నా.. ఒక వ్యక్తిగా, ఆటగాడిగా చాలా ఎదిగాననిపిస్తుంది. క్రికెట్‌ కంటే జీవితంలో ఎన్నో ముఖ్యమైన విషయాలు ఉంటాయని తెలుసుకున్నా. మన ఆత్మీయులను పోగొట్టుకున్నప్పుడు ఆ బాధ మనకు తెలుస్తుంది. అది నేను అనుభవించా. ఈ ఏడాది మా అక్క మరణం నా జీవితాన్ని తలకిందులు చేసింది. ఆమె మరణంతో ఒక్కసారిగా అంతా కోల్పోయానన్న భావన కలిగింది. 

కానీ దేశం కోసం మనకిష్టమైన ఆట ఆడినప్పుడు విఫలం కంటే సఫలం ఎక్కువగా ఉంటుందని అక్క చెప్పిన మాటలు మనసులో ఉంచుకున్నా. జట్టులో ఎంపికవుతామా అన్న విషయాన్ని పక్కనబెట్టి రాణిస్తే ఫలితాలు వెతుక్కుంటూ వస్తాయని నా విషయంలో నిరూపితమైంది. ఇక జట్టులోకి తిరిగి రావడం సంతోషమనిపించింది. జట్టులో నా పాత్రను సమర్థంగా పోషిస్తానని అనుకుంటున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక పాకిస్తాన్‌ ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్‌ ఏడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ ఆడనుంది. ఇది ముగిసిన అనంతరం ఆస్ట్రేలియాకు వెళ్లనున్న పాకిస్తాన్‌ టి0 ప్రపంచకప్‌లో ఆడనుంది. తమ తొలి మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో అక్టోబర్‌ 23న(ఆదివారం) ఆడనుంది.

చదవండి: ఆస్ట్రేలియాతో తొలి టీ20.. మొహాలీకి చేరుకున్న భారత ఆటగాళ్లు

మరిన్ని వార్తలు