24 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌ ఓపెనర్‌గా..

6 Aug, 2020 19:52 IST|Sakshi

వరుస మూడు సెంచరీలతో మసూద్‌ మరో రికార్డు

‘హ్యాట్రిక్’‌ శతకాలు కొట్టిన రెండో పాక్‌ ఓపెనర్‌

మాంచెస్టర్‌: పాకిస్తాన్‌ ఓపెనర్‌ షాన్‌ మసూద్‌ అరుదైన రికార్డును నమోదు చేశాడు. ఇంగ్లండ్‌తో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో మసూద్‌ సెంచరీ సాధించాడు. 251 బంతుల్లో 13 ఫోర్లతో శతకం బాదేశాడు. ఈ రోజు(రెండో రోజు) ఆటలో బాబర్‌ అజామ్‌ సెంచరీ చేస్తాడనుకుంటే అతను మాత్రం 69 వ్యక్తిగత పరుగుల వద్ద పెవిలియన్‌ చేరాడు. ఆ తరుణంలో మసూద్‌ నిలకడగా ఆడాడు. ఇంగ్లండ్‌ బౌలర్ల నుంచి పదునైన బంతులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో శతకం పూర్తి చేస్తున్నాడు. ఫలితంగా ఇంగ్లండ్‌ గడ్డపై టెస్టుల్లో శతకం సాధించిన ఐదో పాకిస్తాన్‌ ఓపెనర్‌గా నిలిచాడు. కాగా, 24 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌ గడ్డపై సెంచరీ సాధించిన తొలి పాకిస్తాన్‌ ఓపెనర్‌గా మసూద్‌ నిలవడం ఇక్కడ విశేషం. ఇంగ్లండ్‌ గడ్డపై చివరిసారి 1996లో సయ్యీద్‌ అన్వర్‌ టెస్టుల్లో శతకం సాధించిన పాక్‌ ఓపెనర్‌ కాగా, ఆ తర్వాత ఇంతకాలానికి మసూద్‌ సాధించాడు. 

ఇక ఇది మసూద్‌కు టెస్టుల్లో వరుసగా మూడో సెంచరీ. 2019-20 సీజన్‌లో మసూద్‌ మూడో సెంచరీని ఖాతాలో  వేసుకున్నాడు. ఫలితంగా టెస్టుల్లో వరుసగా మూడు సెంచరీలు సాధించిన ఆరో పాకిస్తాన్‌ ఆటగాడిగా మసూద్‌ నిలిచాడు. అంతకుముందు జహీర్‌ అబ్బాస్‌(1982-83), ముదాస్సార్‌ నజార్‌(1983), మహ్మద్‌ యూసఫ్‌(2006), యూనిస్‌ ఖాన్‌(2014), మిస్బావుల్‌ హక్‌(2014)లు హ్యాట్రిక్‌ సెంచరీలు సాధించిన పాక్‌ క్రికెటర్లు. కాగా, ఇందులో ముదాస్సార్‌ నజార్‌ మాత్రమే ఓపెనర్‌ కాగా, ఆ తర్వాత స్థానంలో మసూద్‌ నిలిచాడు.  (ఐపీఎల్‌ కొత్త టైటిల్‌ స్పాన్సర్‌ ఎవరు?)

139/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఈ రోజు ఇన్నింగ్స్‌ కొనసాగించిన పాకిస్తాన్‌ ఆదిలోనే వికెట్‌ను కోల్పోయింది. ఓవర్‌నైట్‌ ఆటగాడు బాబర్‌ అజామ్‌(69) నిన్నటి స్కోరు వద్దే పెవిలియన్‌ చేరాడు. అండర్సన్‌ వేసిన బౌలింగ్‌లో రూట్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఫలితంగా పాకిస్తాన్‌ 139 పరుగుల వద్దే మూడో వికెట్‌ నష్టపోయింది. ఆపై షఫీక్‌(7), రిజ్వాన్‌(9)లు నిరాశపరచడంతో పాక్‌ కష్టాల్లో పడింది. ఆ తరుణంలో మసూద్‌ బాధ్యతాయుతంగా ఆడాడు. ఈ క‍్రమంలోనే తొలుత హాఫ్‌ సెంచరీ చేసుకున్న మసూద్‌.. దాన్ని సెంచరీగా మలుచుకున్నాడు. దాంతో పాక్‌ తేరుకుంది. పాకిస్తాన్‌ 95 ఓవర్లు ముగిసేసరికి ఐదు వికెట్ల నష్టానికి 281 పరుగులతో ఉంది. మసూద్‌(126 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నాడు.  ఇది మసూద్‌కు నాల్గో టెస్టు సెంచరీ.

మరిన్ని వార్తలు