రాజస్తాన్‌ జట్టు మెంటార్‌గా వార్న్‌

14 Sep, 2020 11:53 IST|Sakshi

కోచింగ్‌ బృందంలో భాగం

దుబాయ్‌: ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టుకు ఇప్పటికే ప్రచారకర్తగా ఉన్న ఆస్ట్రేలియా దిగ్గజం షేన్‌వార్న్‌ ఇప్పుడు మరో పాత్రలోకి ప్రవేశిస్తున్నాడు. జట్టులోని యువ ఆటగాళ్లను తీర్చి దిద్దేందుకు వార్న్‌ను టీమ్‌ మెంటార్‌గా ఎంపిక చేసినట్లు ఫ్రాంచైజీ ప్రకటించింది. టీమ్‌ కోచ్, తన విక్టోరియా జట్టు మాజీ సహచరుడు అయిన ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌తో కలిసి వార్న్‌ పని చేస్తాడు. ‘నా కుటుంబంలాంటి  జట్టు రాజస్తాన్‌తో రాయల్స్‌తో మళ్లీ జత కట్టడం సంతోషంగా ఉంది. ఈ జట్టు కోసం  ఏ రూపంలో అయినా పని చేయడాన్ని నేను ప్రేమిస్తాను.

అందుకే ఇకపై ద్విపాత్రాభినయానికి సిద్ధమయ్యాను’ అని వార్న్‌ వ్యాఖ్యానించాడు. జట్టు మెంటార్‌గా పని చేసేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాన్ని ఈ మాజీ లెగ్‌స్పిన్నర్‌ తాజా సీజన్‌లో రాయల్స్‌ మంచి ప్రదర్శన ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. 2008లో జరిగిన తొలి ఐపీఎల్‌ను షేన్‌ వార్న్‌ నాయకత్వంలోనే రాజస్తాన్‌ గెలుచుకుంది. అప్పటినుంచి ఏదో ఒక రూపంలో టీమ్‌తో అతను తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు. శనివారమే అతను తన 51వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. 

మరిన్ని వార్తలు