వార్న్‌కు ఘన నివాళి

6 Mar, 2022 05:13 IST|Sakshi

మెల్‌బోర్న్‌: శుక్రవారం ఆకస్మికంగా మృతి చెందిన స్పిన్‌ దిగ్గజం షేన్‌వార్న్‌కు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులంతా నివాళులు అర్పించారు. ఎంసీజీ బయట ఉన్న అతని విగ్రహం వద్ద పూలు ఉంచి ఆస్ట్రేలియా ఫ్యాన్స్‌ స్పిన్‌ దిగ్గజం జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మరోవైపు వార్న్‌ కుటుంబ సభ్యులు అనుమతిస్తే అధికారిక లాంఛనాలతో అతనికి అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆస్ట్రేలియా దేశ ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ ప్రకటించారు. ‘మా దేశానికి చెందిన గొప్ప వ్యక్తుల్లో ఒకడిగా వార్న్‌ నిలిచిపోతాడు.

అతని బౌలింగ్‌లో ప్రత్యేక ఆకర్షణ ఉంది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన వార్న్‌ తన జీవితాన్ని కూడా అద్భుతంగా జీవించాడు’ అని ఆయన సంతాపం ప్రకటించారు. ఎంసీజీలోని గ్రేట్‌ సదరన్‌ స్టాండ్‌కు షేన్‌ వార్న్‌ పేరు పెడుతున్నట్లు కూడా ఆసీస్‌ క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. వార్న్‌ సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించిన ఇంగ్లీష్‌ కౌంటీ ‘హాంప్‌షైర్‌’ ప్రధాన కేంద్రమైన సౌతాంప్టన్‌లో కూడా అతనికి సంతాపం ప్రకటిస్తూ పలు కార్యక్రమాలు జరిగాయి. రోజ్‌ బౌల్‌ మైదానంలో ఇంగ్లండ్‌ అభిమానులు వార్న్‌కు నివాళులు అర్పించారు.

మరిన్ని వార్తలు