'కోహ్లి రనౌట్‌.. మాకు పెద్ద అవమానం'

18 Dec, 2020 09:17 IST|Sakshi

అడిలైడ్‌ : ఆసీస్‌తో జరుగుతున్న పింక్‌ టెస్టులో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రనౌట్‌ అవుతాడని ఎవరు ఊహించి ఉండరు. రహానేతో సమన్వయ లోపం వల్ల కోహ్లి రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. కోహ్లి లాంటి బిగ్‌ వికెట్‌తో ఆసీస్‌కు ఉపశమనం కలగగా.. అతని అవుట్‌ అభిమానులకు నిరాశ కలిగించింది. తాజాగా కోహ్లి రనౌట్‌పై ఆసీస్‌ దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ స్పందించాడు. కోహ్లి రనౌట్‌ కావడం నన్ను బాధించింది. అతను క్రీజులోకి వచ్చినప్పుడే పెద్ద ఇన్నింగ్స్‌ ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఆ దిశగా దూసుకెళ్తున్న కోహ్లి అనూహ్యంగా రనౌట్‌ కావడం బాధాకరం. ఇది మాలాంటి క్రికెట్‌ అభిమానులకు పెద్ద అవమానం' అని ట్వీట్‌ చేశాడు. (చదవండి : పృథ్వీ షా డకౌట్‌.. వైరలవుతున్న ట్వీట్స్‌)


పుజారా అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రహానే నిలదొక్కుకోవడంతో వీరిద్దరి మధ్య 88 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదైంది. అప్పటికే కోహ్లి 180 బంతుల్లో 74 పరుగులతో క్రీజులో పాతుకుపోయి సెంచరీ దిశగా దూసుకెళుతున్నాడు. ఈ నేపథ్యంలో లయన్‌ బౌలింగ్‌లో రహానే ఫ్లిక్‌ చేయగా మిడాఫ్‌లో ఉన్న హాజల్‌వుడ్‌ బంతిని లయన్‌కు అందించగా అతను నేరుగా వికెట్లను గిరాటేశాడు. కాగా రహానే కాల్‌తో అప్పటికే సగం పిచ్‌ దాటేసిన కోహ్లి ఏం చేయలేక నిరాశగా వెనుదిరిగాడు. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే టీమిండియా మొదటి రోజు ఆట ముగిసేసరికి 89 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. కోహ్లి (180 బంతుల్లో 74; 8 ఫోర్లు) భారత ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. పుజారా (160 బంతుల్లో 43; 2 ఫోర్లు), రహానే (92 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. స్టార్క్‌ 2 వికెట్లు తీయగా... హాజల్‌వుడ్, కమిన్స్, లయన్‌లకు తలా ఒక వికెట్‌ దక్కింది. వృద్ధిమాన్‌ సాహా (9 బ్యాటింగ్‌), అశ్విన్‌ (15 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.(చదవండి : పుజారా గోడ.. ద్రవిడ్‌ కంటే బలమైనదట!)

మరిన్ని వార్తలు