ఆ దిగ్గజ ఆటగాడు గ్రౌండ్‌లోకి వచ్చే ముందు సిగరెట్ కాల్చేవాడు.. 

24 May, 2021 21:25 IST|Sakshi

మెల్ బోర్న్: స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ గురించి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ సంచలన విషయాలు వెల్లడించాడు. వార్న్కు  మైదానంలోకి అడుగుపెట్టే ముందు సిగరెట్ కాల్చే అలవాటు ఉండేదని బహిర్గతం చేశాడు. కెరీర్ మొత్తంలో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన స్పిన్ మాంత్రికుడు.. అఫ్ ద ఫీల్డ్ విషయాల గురించి ఉపశమనం పొందేందుకే ఆ  విధంగా చేసేవాడని చెప్పుకొచ్చాడు. వార్న్కు మానసిక స్థైర్యం ఎక్కువని, అదే అతని బలమని పేర్కొన్నాడు. 

వార్న్.. ఆన్ ఫీల్డ్లో ఏరకంగా రెచ్చిపోయేవాడో, అఫ్ ద ఫీల్డ్ కూడా అదే రకంగా ప్రవర్తించి వివాదాలను కొని తెచ్చుకునేవాడని కుండ బద్దలు కొట్టాడు. దీంతో అతను మీడియా నుంచి వచ్చే ఒత్తిడిని అధిగమించేందుకు సిగరెట్ కాల్చేవాడని, తన వ్యక్తిగత విషయాలు ఆటపై ప్రభావం చూపకూడదనే ఉద్దేశంతోనే అతను అలా చేసే వాడని వివరించాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అల్ టైమ్ గ్రేట్ స్పిన్నర్గా  గుర్తింపు తెచ్చుకున్న వార్న్.. తన హయాంలో ఆస్ట్రేలియాను జగజ్జేతగా నిలిపాడని కొనియాడాడు.  

ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన సందర్భాల్లో మీడియా వార్న్ వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేసేదని, దానికి అతడు గ్రౌండ్లోనే బదులిచ్చేవాడని చెప్పుకొచ్చాడు. మైదానం వెలుపల అతని ప్రవర్తన ఎలా ఉన్నా, దాని తాలూకా ప్రభావాన్ని మాత్రం ఆన్ ఫీల్డ్ ఎప్పుడూ చూపించేవాడు కాదని వార్న్ను వెనకేసుకొచ్చాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న వార్న్.. 145 మ్యాచ్ల్లో 708 వికెట్లు సాధించాడు. 
 

మరిన్ని వార్తలు