వాట్సన్‌ ఉద్వేగం.. క్రికెట్‌కు గుడ్‌ బై!

2 Nov, 2020 17:48 IST|Sakshi

దుబాయ్‌: నాలుగేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన ఆస్ట్రేలియా క్రికెటర్‌ షేన్‌ వాట్సన్‌.. తాజాగా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఐపీఎల్‌ సీజన్‌  తర్వాత వాట్సన్‌  క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని ముందు నుంచి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇదే వాట్సన్‌కు ‘చివరి ఆట’ అనే మాట ఎక్కుగా వినిపించింది. ఆదివారం కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌ సీఎస్‌కేకు చివరిది. ఈ సీజన్‌లో  లీగ్‌ దశ నుంచి సీఎస్‌కే ఆట ముగించడంతో ఇక ఆ జట్టు ఆటగాళ్లు తమ తమ స్వస్థలాలకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే సీఎస్‌కే సభ్యులకు వాట్సన్‌ వీడ్కోలు సందేశాన్ని ఇచ్చినట్లు సమాచారం.  తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని సహచరులతో షేర్‌ చేసుకునే క్రమంలో వాట్సన్‌ ఉద్వేగానికి గురయ్యాడట.(ఐపీఎల్‌ 2020: నెట్‌ రన్‌రేట్‌ టై అయితే..)

ఈ సీజన్‌లో వాట్సన్‌ 11 మ్యాచ్‌లు ఆడి 299 పరుగులు చేశాడు. ఇందుదలో రెండు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 2018 నుంచి సీఎస్‌కేకు ప్రాతినిథ్యం వహిస్తున్న వాట్సన్‌.. ఆ ఏడాది టైటిల్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో సెంచరీ సాధించి సీఎస్‌కే టైటిల్‌ సాధించడంలో ముఖ్యపాత్ర పోషించాడు. గతేడాది ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఫైనల్‌లో వాట్సన్‌ హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. కానీ సీఎస్‌కే పరుగు తేడాతో టైటిల్‌ను కోల్పోయింది. సీఎస్‌కే తరఫున ఆడటానికి ముందు వాట్సన్‌ రాజస్తాన్‌ రాయల్స్‌, రాయల్స్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్లకు ఆడాడు. ఓవరాల్‌గా 145 ఐపీఎల్‌ మ్యాచ్‌లను వాట్సన్‌ ఆడాడు. అందులో సీఎస్‌కే తరఫున ఆడినవి 43. వాట్సన్‌ తన ఐపీఎల్‌ కెరీర్‌లో 3,874 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 21 హాఫ్‌ సెంచరీలున్నాయి. ఆల్‌రౌండర్‌ అయిన వాట్సన్‌ 92 ఐపీఎల్‌ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. గతేడాది తమ దేశంలో జరిగే బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)కు వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు