ధోనికి వయసుతో సంబంధం లేదు : వాట్సన్‌

12 Aug, 2020 13:24 IST|Sakshi

ఢిల్లీ : ఆటకు వయసుతో సంబంధం లేదని.. ఏ వయసులో ఉన్నా సరే ఫిట్‌నెస్‌ బాగుంటే బ్యాట్సమన్‌కు ఏ రికార్డైనా సాధ్యమవుతుంది.. ఇదే అంశం తనకు ధోనిలోనూ కనిపిస్తోందంటూ చెన్నై సూపర్‌కింగ్స్‌ సహచర ఆటగాడు షేన్‌ వాట్సన్‌ అంటున్నాడు. సెప్టెంబర్‌ 19 నుంచి దుబాయ్‌ వేదికగా ఐపీఎల్‌ 13వ సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వాట్సన్‌ ధోని గురించి, సీఎస్‌కే విజయావకాశాలపై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.('సంజయ్‌.. ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలుసు')

'ధోని.. క్రికెట్‌ ఆడేందుకు ఇష్టపడుతున్నాడు. అతను ఎప్పటికి ఎవర్‌ గ్రీన్‌ ఆటగాడు అనడంలో సందేహం లేదు. అతనికి వయసుతో సంబంధం లేదు.. 40 ఏళ్లు దాటిన తర్వాత కూడా ధోని అదే కచ్చితమైన వేగంతో పరుగులు సాధిస్తాడని నా నమ్మకం. బ్యాటింగ్‌లోనే కాదు.. కీపింగ్‌లోనూ తనదైన శైలిని చూపించే ఎంఎస్‌ ధోనికి నేను పెద్ద అభిమానిని. అది ఐపీఎల్‌ లేక అంతరర్జాతీయ మ్యాచ్‌ ఏదైనా కావొచ్చు.. అతని ఆటను ఎప్పటికి ఇష్టపడుతూనే ఉంటా.' అంటూ చెప్పుకొచ్చాడు. ​

ఐపీఎల్‌ 13వ సీజన్‌లో సీఎస్‌కే అవకాశాలు ఎలా ఉన్నాయని వాట్సన్‌ను ప్రశ్నించారు. దీనికి వాట్సన్‌ స్పందిస్తూ.. ' అందరితో పాటు మాకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అనుభవం కలిగిన ఆటగాళ్లతో పాటు యువ ఆటగాళ్లతో జట్టు సమతూకంగా ఉంది.అందులోనూ ఎంఎస్‌ ధోని కెప్టెన్సీ.. కోచ్‌గా స్టీఫెన్‌ ప్లెమింగ్‌ ఉండడం జట్టుకు అదనపు బలం. ఇన్ని అంశాలతో మా జట్టుకు టైటిల్‌ గెలిచే సత్తా ఉంది. అంటూ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌లో విజయవంతమైన జట్లలో ఒకటిగా పేరున్న చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇప్పటివరకు మూడుసార్లు టైటిల్( 2010,2011,2018) సాధించింది. గతేడాది ఐపీఎల్‌ 2019 సీజన్‌లో  ముంబైతో జరిగిన థ్రిల్లింగ్‌ ఫైనల్లో కేవలం ఒక్కపరుగు తేడాతో ఓడిపోయి నాలుగోసారి టైటిల్‌ను నెగ్గే అవకాశం కోల్పోయింది.

మరిన్ని వార్తలు