'ధోని ఇంపాక్ట్‌ ఎంత అనేది అ‍ప్పుడు తెలిసింది'

4 Nov, 2020 17:02 IST|Sakshi

దుబాయ్‌ : ఆసీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌ 2016లోనే అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వీడ్కోలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌లలో ఆయా ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించాడు. తాజాగా వాట్సన్‌ గత మంగళవారం అన్ని రకాల టీ20 క్రికెట్‌ లీగ్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నట్లు తెలిపాడు. ఈ సందర్భంగా వాట్సన్‌ సీఎస్‌కే టీమ్‌తో పాటు ధోనితో ఉన్న అనుబంధం గురించి పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. (చదవండి : వాట్సన్‌ ఉద్వేగం.. క్రికెట్‌కు గుడ్‌ బై!)

' 2018 నుంచి సీఎస్‌కేతో ఉన్న మూడేళ్ల ప్రయాణం నాకు మరువలేనిది. ఈ మూడేళ్లలో సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనితో పాటు కోచ్‌ స్టీఫెన్‌ ప్లెమింగ్ నాకు ఎంతో సహకరించారు. ఒక దశలో వరుసగా 10 మ్యాచ్‌ల్లో విఫలమైన సమయంలో ధోని నాకు అండగా నిలిచాడు.  కేవలం నాపై ఉన్న నమ్మకంతోనే అవకాశాలు కల్పించాడు. ఈ మూడేళ్లలో సీఎస్‌కేతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. నేను మొదటిసారి సీఎస్‌కే జట్టులో అడుగుపెట్టిన 2018లోనే చెన్నై సూపర్‌కింగ్స్‌ టైటిల్‌ కొల్లగొట్టడం.. అదే విధంగా నేను ఆడిన మొదటి ఐపీఎల్‌ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరపున మొదటి ఐపీఎల్‌ టైటిల్‌ గెలవడం యాదృశ్చికం అనే చెప్పొచ్చు.

ఒకసారి ఐపీఎల్‌ సీజన్‌ సందర్భంగా ఒకసారి విమానంలో ప్రయాణం చేస్తుండగా ధోనిపై తీసిన డాక్యుమెంటరీ చూసాను.  ఆ డాక్యుమెంటరీలో ధోని అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టినప్పటినుంచి కెప్టెన్‌ అయ్యేవరకు చూశాం. ధోని అనే పేరుకు ఇంత అభిమానం ఉందా.. ఒక వ్యక్తిపై భారతీయ ప్రజలు ఇంతలా గౌరవిస్తారా అనేది వీడియో చూసిన తర్వాత నాకు అర్థమైంది.  బహుశా సచిన్‌ తర్వాత భారత క్రికెట్‌లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది ధోనిలోనే అనుకుంటా. ఒక కెప్టెన్‌గా ప్రతి చిన్న విషయానికి ఏమాత్రం బయపడకుండా అతను తీసుకునే నిర్ణయాలు కూల్‌ కెప్టెన్‌ అనే పేరును సార్థకం చేశాయని చెప్పొచ్చు. జట్టు ఎలాంటి సంక్లిష్ట పరిస్థితిలో ఉన్నా.. కేవలం తన ఆలోచనలతోనే ఓటమి నుంచి విజయాల బాట పట్టించాడు.

భారత్‌లో క్రికెట్‌కు ఎంతలా అభిమానులుంటారనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐపీఎల్‌ సందర్భంలో ఇలాంటివి నేను చాలా చూశా. ధోనికున్న ఫాలోయింగ్‌తో సాధారణంగానే సీఎస్‌కేకు ఎక్కువగా అభిమానులు ఉండేవారు. చెన్నైలో మ్యాచ్‌లు జరిగేటప్పుడు అభిమానం ఎంతలా ఉంటుందో.. మేం బయటి మైదానాల్లో ఆడేటప్పుడు కూడా సీఎస్‌కేకు అంతేమంది ఫ్యాన్స్‌ ఉంటారు. ఇది కేవలం ధోని క్రియేట్‌ చేసిన ఇంపాక్ట్‌ అని స్పష్టంగా చెప్పొచ్చు. 'అని వాట్సన్‌ చెప్పుకొచ్చాడు. (చదవండి : అంతర్జాతీయ క్రికెట్‌కు శామ్యూల్స్‌ గుడ్‌బై)

అంతర్జాతీయ కెరీర్‌లో మంచి ఆల్‌రౌండర్‌గా పేరుపొందిన వాట్సన్‌ ఐపీఎల్‌లోనూ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 2008లో ప్రారంభమైన ఐపీఎల్‌ మొదటి సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన అతను తొలి సీజన్‌లోనే 472 పరుగులతో పాటు 17 వికెట్లు తీసి ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచాడు. రాజస్తాన్‌ రాయల్స్‌ మొదటి టైటిల్‌ గెలవడంలో వాట్సన్‌ పాత్ర కీలకం. ఆ తర్వాత దాదాపు ఏడు సీజన్లపాటు రాయల్స్‌కు ఆడాడు. కాగా ఆర్‌ఆర్‌ జట్టుపై నిషేధం పడిన తర్వాత 2016లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన వాట్సన్‌ 2018లో సీఎస్‌కే గూటికి చేరాడు. 2018లో సన్‌రైజర్స్‌తో జరిగిన ఫైనల్లో 57 బంతుల్లోనే 117 పరుగులు సుడిగాలి ఇన్నింగ్స్‌తో సీఎస్‌కేను మూడోసారి ఐపీఎల్‌ చాంపియన్‌గా నిలిపాడు.  ఓవరాల్‌గా ఐపీఎల్‌ కెరీర్‌లో 145 మ్యాచ్‌లాడి 3874 పరుగులు, బౌలింగ్‌లో 92 వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని వార్తలు