T20 WC: అతడి స్థానాన్ని ప్రపంచంలో ఎవరూ భర్తీ చేయలేరు.. భారత్‌ గెలవడం కష్టమే: ఆసీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌

2 Oct, 2022 12:40 IST|Sakshi

T20 World Cup 2022- Jasprit Bumrah: ‘‘ఒకవేళ జస్‌ప్రీత్‌ బుమ్రా గనుక ఫిట్‌నెస్‌ నిరూపించుకోలేక వరల్డ్‌కప్‌ టోర్నీకి దూరమైతే టీమిండియాకు ట్రోఫీ గెలిచే అవకాశాలు సంక్లిష్టమవుతాయి. తన అటాకింగ్‌ బౌలింగ్‌తో బుమ్రా ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించగలడు. అదే విధంగా అంత తేలికగా పరుగులు సమర్పించుకోడు.

అతడు అసాధారణ ప్రతిభ, నైపుణ్యాలు కలవాడు. కేవలం ఇండియాలో మాత్రమే కాదు.. ప్రపంచంలోనే అలాంటి బౌలర్‌ మరొకరు లేరని చెప్పొచ్చు. ఒకవేళ గాయం కారణంగా అతడు దూరమైతే టీమిండియాకు అది తీరని లోటు’’ అని ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌ అన్నాడు. 


జస్‌ప్రీత్‌ బుమ్రా

వేధిస్తున్న గాయం
టీ20 ప్రపంచకప్‌-2022కు ముందు స్వదేశంలో టీమిండియా.. దక్షిణాఫ్రికాతో సిరీస్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే, వెన్నునొప్పి తిరగబెట్టిన కారణంగా తిరువనంతపురం వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌కు బుమ్రా దూరమయ్యాడు. ప్రస్తుతం అతడు జాతీయ క్రికెట్‌ అకాడమీలో చికిత్స తీసుకుంటున్నాడు. 

ఫ్యాన్స్‌లో ఆందోళన
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ సహా టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌.. బుమ్రా ఇంకా ప్రపంచకప్‌ జట్టు నుంచి పూర్తిగా తప్పుకోలేదని చెబుతున్నా అభిమానులను మాత్రం భయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒకవేళ గాయం నుంచి పూర్తిగా కోలుకోనట్లయితే ఈ ఐసీసీ మెగా టోర్నీకి అతడు దూరమయ్యే అవకాశాలే ఎక్కువ. 

ఈ నేపథ్యంలో మహ్మద్‌ సిరాజ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌లను జట్టుతో పంపేందుకు బీసీసీఐ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో షేన్‌ వాట్సన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ అతడిని ఆకాశానికెత్తాడు.

అతడి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు
‘‘ప్రస్తుతం బుమ్రా స్థానాన్ని భర్తీ చేయగల బౌలర్‌ ప్రపంచంలోనే లేడు. బుమ్రాలాగా అటాక్‌ చేస్తూ.. డిఫెన్సివ్‌గా ఆడగలిగే వాళ్లు చాలా తక్కువ. అతడు లేకుండా మెగా టోర్నీ ఆడటం టీమిండియాకు కఠిన సవాలు. మిగిలిన ఫాస్ట్‌బౌలర్లలో ఎవరో ఒకరు మెరుగ్గా రాణిస్తేనే టైటిల్‌ రేసులో నిలవగలుగుతుంది’’ అని వాట్సన్‌ ఎన్డీటీవీతో వ్యాఖ్యానించాడు. కాగా అక్టోబరు 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌కప్‌ ఈవెంట్‌ ఆరంభం కానుంది.

చదవండి: Ind Vs SA: అతడొక అద్భుతం.. టీమిండియాకు మరో జహీర్‌ ఖాన్‌ దొరికేశాడు: పాక్‌ మాజీ క్రికెటర్‌
Asia Cup 2022: తల్లి అంపైర్‌.. కూతురు ఆల్‌రౌండర్‌.. ఇద్దరూ ఒకేసారి! వీరికి వెనుక ఉన్నది ఎవరంటే!

మరిన్ని వార్తలు