Shardul Thakur: ప్రేయసితో ఘనంగా టీమిండియా ఆల్‌రౌండర్‌ పెళ్లి

28 Feb, 2023 11:40 IST|Sakshi

టీమిండియా ఆల్‌రౌండర్‌ శార్దూల్ ఠాకూర్ సోమవారం రాత్రి ఒక ఇంటివాడయ్యాడు. తన స్నేహితురాలు, వ్యాపారవేత్త మిథాలీ పారుల్కర్‌ను పెళ్లాడాడు. బంధువులు, స్నేహితులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యారు. ముంబైలో అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుక జరిగింది. గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. ఇరు కుటుంబాలు అంగీకరించడంతో గతేడాది నవంబర్‌లో నిశ్చితార్థం జరిగింది. తాజాగా సోమవారం రాత్రి వివాహబంధంతో వీరిద్దరు ఒక్కటయ్యారు.

మిథాలీ పారుల్కర్ ‘ది బేక్స్’ పేరుతో బేకరీ ఫుడ్ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఆల్ ది జాజ్ లగ్జరీ బేకర్స్ సంస్థ ద్వారా ముంబైలో వ్యాపారాలను నిర్వహిస్తోంది. క్రికెటర్ దీపక్ చాహర్ భార్య మాలతీ చాహర్ వివాహ వేడుకలో కనిపించింది. కేకేఆర్ టీమ్ మేనేజ్‌మెంట్ సభ్యుడు అభిషేక్ నాయర్, ముంబై ప్లేయర్ సిద్ధేష్ లాడ్ కూడా శార్దూల్ ఠాకూర్ పెళ్లికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

ఇక టీమిండియా తరపున శార్దూల్‌ ఠాకూర్‌  8 టెస్టులు, 34 వన్డేలు, 25 టి20 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. గతేడాది ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన శార్దూల్‌ 14 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీయడంతో పాటు 120 పరుగులు చేశాడు. గతేడాది మినీ వేలంలో శార్దూల్‌ ట్రేడింగ్‌లో కేకేఆర్‌కు బదిలీ అయ్యాడు. మార్చి 31 నుంచి ఐపీఎల్‌ 2023 సీజన్‌ షురూ కానుంది. కాగా, పెళ్లి కారణంగా శార్దూల్ ఠాకూర్ ఆస్ట్రేలియాతో టెస్ట్‌ సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే, ఆసీస్‌తో వన్డే సిరీస్ కు శార్దూల్ జట్టులో చేరతాడని సమాచారం.

చదవండి: ఓటమి నేర్పిన పాఠం.. ప్రతీసారి 'బజ్‌బాల్‌' పనికిరాదు

పరుగు తేడాతో విజయం.. 30 ఏళ్ల రికార్డు ‍కనుమరుగు

మరిన్ని వార్తలు