ILT 20 2023: ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు.. పఠాన్‌ను ఉతికారేసిన విండీస్‌ స్టార్‌

3 Feb, 2023 08:43 IST|Sakshi

అబుదాబి వేదికగా ఇంటర్నేషనల్‌ లీగ్‌ టి20లో షెర్ఫెన్‌ రూథర్‌ఫోర్డ్‌ విధ్వంసం సృష్టించాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల ఫీట్‌ మిస్‌ అయినప్పటికి ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి ఔరా అనిపించాడు. రూథర్‌ఫోర్డ్‌ దెబ్బకు యూసఫ్‌  పఠాన్‌ ఒకే ఓవర్లో 31 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. విషయంలోకి వెళితే.. గురువారం రాత్రి దుబాయ్‌ క్యాపిటల్స్‌, డెసర్ట్‌ వైపర్స్‌ మధ్య 25వ లీగ్‌ మ్యాచ్‌ జరిగింది.

ఇన్నింగ్స్‌ 16 ఓవర్లో యూసఫ్‌ పఠాన్‌ బౌలింగ్‌కు వచ్చాడు. తొలి బంతికి సామ్‌ బిల్లింగ్స్‌ సింగిల్‌ తీసి రూథర్‌ఫోర్డ్‌కు స్ట్రైక్‌ ఇచ్చాడు. ఏమైందో తెలియదు కానీ ఒక్కసారిగా పూనకం వచ్చినట్లుగా చెలరేగిపోయాడు రూథర్‌ఫోర్డ్‌. రెండో బంతిని లాంగాఫ్‌ మీదుగా 90 మీటర్లు, మూడో బంతి లాంగాన్‌ మీదుగా, నాలుగో బంతిని బ్యాక్‌ఫుట్‌ తీసుకొని కళ్లుచెదిరే స్ట్రెయిట్‌ సిక్స్‌ కొట్టి హ్యాట్రిక్‌ సిక్సర్లు పూర్తి చేశాడు. ఈ విధ్వంసం ఇక్కడితో ఆగలేదు. ఐదో బంతిని స్క్వేర్‌లెగ్‌లో భారీ సిక్సర్‌ బాదాడు. ఇక ఓవర్‌ చివరి బంతిని మోకాళ్లపై కూర్చొని స్వీప్‌ షాట్‌తో సిక్సర్‌ తరలించాడు.

దీంతో ఐదు వరుస బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టిన రూథర్‌ఫోర్డ్‌ మరుసటి ఓవర్లో ఆరో సిక్సర్‌ కొట్టే అవకాశం వచ్చినప్పటికి విఫలమయ్యాడు​. ఈ దశలో 23 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే మరుసటి బంతికే బిల్లింగ్స్‌తో ఏర్పడిన సమన్వయలోపంతో రూథర్‌ఫోర్డ్‌ రనౌట్‌గా వెనుదిరగడంతో అతని విధ్వంసానికి తెరపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన డెసర్ట్‌ వైపర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.రూథర్‌ఫోర్డ్‌(23 బంతుల్లో 50, ఆరు సిక్సర్లు), సామ్‌ బిల్లింగ్స్‌(48 బంతుల్లో 54 పరుగులు), ముస్తఫా 31 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన దుబాయ్‌ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేసి 22 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. 

చదవండి: ట్రెండింగ్‌ పాటకు క్రికెటర్స్‌ అదిరిపోయే స్టెప్పులు

మరిన్ని వార్తలు