Shikhar Dhawan: టీ20లకు పక్కనపెట్టారు కదా! సెలక్టర్లు ఏం ఆలోచిస్తారో మనకు తెలియదు!

7 Aug, 2022 16:44 IST|Sakshi
శిఖర్‌ ధావన్‌(PC: BCCI)

గత కొంతకాలంగా టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ పేరును కేవలం వన్డే జట్టు ఎంపికలోనే పరిగణనలోకి తీసుకుంటున్నారు సెలక్టర్లు. ఐపీఎల్‌-2022లో రాణించిన వెటరన్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తిక్‌కు టీ20 జట్టులో చోటు కల్పిస్తున్నా.. గబ్బర్‌కు మాత్రం మొండిచేయి చూపుతున్నారు. 

అయితే వన్డేల్లో మాత్రం అడపా దడపా అవకాశాలు వస్తున్నాయి. అంతేకాదు ఇటీవల ముగిసిన వెస్టిండీస్‌ సిరీస్‌లో రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గైర్హాజరీలో కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు ధావన్‌. కానీ.. పొట్టి ఫార్మాట్‌లో మాత్రం గబ్బర్‌కు నిరాశ తప్పడం లేదు.

ముఖ్యంగా టీ20 వరల్డ్‌కప్‌-2022 టోర్నీ సమయం దగ్గరపడుతున్న వేళ యువకులతో పలు ప్రయోగాలు చేస్తున్న యాజమాన్యం ధావన్‌ పేరును పూర్తిగా పక్కనపెట్టినట్లే కనిపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో స్పోర్ట్స్‌తక్‌తో మాట్లాడిన శిఖర్‌ ధావన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 జట్టులో చోటు దక్కకపోవడం వల్ల తానేమీ నిరాశ చెందడం లేదని పేర్కొన్నాడు.

నేనేమీ ఫీల్‌ కావడం లేదు
ఈ మేరకు 36 ఏళ్ల గబ్బర్‌ మాట్లాడుతూ.. ‘‘నిజం చెప్పాలంటే నేనేమీ ఫీల్‌ కావడం లేదు. నిరాశ పడటం లేదు కూడా! ప్రతి దానికి ఓ టైమ్‌ అంటూ ఉంటుంది. ఇప్పుడైతే నా టైమ్‌ నడవడం లేదు(నాకు పరిస్థితులు అనుకూలంగా లేవు)! ఒకవేళ నేనే బాగా ఆడలేకపోతున్నానేమో(ఇతరుల దృష్టిలో)! అయినా నేనేమీ బాధపడటం లేదు.

నా వరకు నేను అత్యుత్తుమ ఆట తీరు కనబరుస్తున్నాననే అనుకుంటున్నా! ఏదేమైనా నేను సంతోషంగా ఉన్నానా లేదా అనేదే నాకు ముఖ్యం. నా పేరు జట్టులో లేకపోయినంత మాత్రాన.. అది నా ఆటపై ప్రభావం చూపదు. ఒకవేళ అవకాశం వచ్చిందంటే.. కచ్చితంగా నన్ను నేను నిరూపించుకుంటా! ఐపీఎల్‌లో నా సర్వశక్తులు ఒడ్డాను. 

అత్యుత్తమంగా రాణించాను. అక్కడ బాగా ఆడాను కాబట్టి నన్ను సెలక్ట్‌ చేస్తారనుకున్నా. కానీ.. నన్ను ఎంపిక చేయాలా వద్దా అన్నది సెలక్టర్ల నిర్ణయం కదా! వాళ్లు ఏం ఆలోచిస్తున్నారో.. జట్టు ఎంపిక విషయంలో ఏ అంశాలు పరిగణనలోకి తీసుకుంటారో నాకు తెలియదు. నేనైతే ఫిట్‌నెస్‌ కాపాడుకుంటూ అవకాశం వస్తే దానిని సద్వినియోగం చేసుకునేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటా’’ అని చెప్పుకొచ్చాడు. 

వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుని
గతేడాది శ్రీలంక పర్యటనలో కెప్టెన్‌గా వ్యవహరించిన తర్వాత ధావన్‌కు జాతీయ జట్టులో చోటు దక్కలేదన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌తో పునరాగమనం చేశాడు. ఆ తర్వాత వెస్టిండీస్‌ పర్యటనలో ఏకంగా సారథిగా అవకాశం వచ్చింది. దీనిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ధావన్‌ కరేబియన్‌ గడ్డపై యువ జట్టుతో చరిత్ర సృష్టించాడు.

ఏకంగా సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్‌ చేసి సత్తా చాటాడు. ఈ క్రమంలో వన్డే వరల్డ్‌కప్‌-2023 జట్టులో ధావన్‌కు చోటు ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2022లో పంజాబ్‌ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన శిఖర్‌ ధావన్‌ 14 ఇన్నింగ్స్‌లో 460 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 88 నాటౌట్‌. అయినా.. పొట్టి ఫార్మాట్‌లో అతడికి అవకాశాలు రావడం లేదు.

చదవండి: CWG 2022: నన్ను క్షమించండి.. మహిళా రెజ్లర్‌ కన్నీటి పర్యంతం.. ప్రధాని మోదీ ట్వీట్‌!
Rohit Sharma: ఎనిమిదింటికి ఎనిమిది గెలిచేశాడు.. 5 క్లీన్‌స్వీప్‌లు.. నువ్వు తోపు కెప్టెన్‌!

మరిన్ని వార్తలు