SA vs IND: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌.. టీమిండియా కెప్టెన్‌గా శిఖర్‌ ధావన్‌!

12 Sep, 2022 10:17 IST|Sakshi

ఆసియాకప్‌-2022 సూపర్‌-4 దశలోనే నిష్క్రమించిన టీమిం‍డియా.. ఇప్పడు హాం సిరీస్‌లతో బీజీ బీజీగా గడపనుంది. టీ20 ప్రపంచకప్‌ సన్నాహాకాలలో భాగంగా తొలుత ఆస్ట్రేలియాతో.. అనంతరం దక్షిణాఫ్రికాతో భారత్‌ తలపడనుంది. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భాగంగా టీమిండియా మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. సెప్టెంబర్‌ 20న మెహాలి వేదిగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది.

అదే విధంగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వన్డే సిరీస్‌లను భారత్‌ ఆడనుంది. సెప్టెంబర్‌ 28న తిరువనంతపురం వేదికగా జరగనున్న తొలి టీ20తో దక్షిణాఫ్రికా టూర్‌ ప్రారంభం కానుంది. కాగా టీ20 సిరీస్‌ ముగిసిన అనంతరం వన్డే సిరీస్‌ జరగనుంది.

అయితే వన్డే సిరీస్‌కు టీ20 ప్రపంచకప్‌లో పాల్గోనే భారత ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వెటరన్‌ ఆటగాడు శిఖర్‌ ధావన్‌కు భారత కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఈ సిరీస్‌కు హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్థానంలో భారత మాజీ ఆటగాడు వీవీయస్‌ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే విండీస్‌, జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌గా ధావన్‌ వ్యవహరించాడు.

"టీ20 ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ ఆడనున్నాం. కొన్ని సార్లు షెడ్యూల్‌ ఈ విధంగానే ఉంటుంది. అయితే కెప్టెన్‌ రోహిత్‌, విరాట్‌ కోహ్లితో పాటు ఈ పొట్టి ప్రపంచకప్‌లో భాగమయ్యే ఆటగాళ్లందరికీ ప్రోటీస్‌ సిరీస్‌కు విశ్రాంతి ఇవ్వనున్నాం. ఈ సిరీస్‌లో భారత జట్టుకు శిఖర్‌ సారథ్యం వహించనున్నాడు" అని బీసీసీఐ అధికారి ఒకరు ఇన్‌సైడ్‌ స్పోర్ట్స్‌తో పేర్కొన్నారు.

కాగా ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ ఆక్టోబర్‌ 16నుంచి ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మెగా ఈవెంట్‌ కోసం భారత జట్టు ఆక్టోబర్‌ 10న ఆస్ట్రేలియాకు వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
చదవండి: Asia Cup2022: ఇదేమి బౌలింగ్‌రా అయ్యా.. తొలి బంతికే 10 పరుగులు!

మరిన్ని వార్తలు