Shikhar Dhawan: కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్న ధావన్‌

7 May, 2021 07:54 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టు ఓపెనర్, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు శిఖర్‌ ధావన్‌ కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ తొలి డోస్‌ను వేయించుకున్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా గురువారం ట్విటర్‌ ద్వారా వెల్లడించాడు. ‘వ్యాక్సినేషన్‌ పూర్తయింది. ఈ కష్ట కాలంలో ముందు వరుసలో నిలబడి ఎంతో అంకితభావంతో తమ విధులను నిర్వర్తిస్తోన్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు కేవలం ధన్యవాదాలు ఏ మాత్రం సరిపోవు. వ్యాక్సినేషన్‌ విషయంలో సందేహాలు వద్దు. వెంటనే వేయించుకోండి. కరోనాను జయించండి’ అంటూ ధావన్‌ ట్వీట్‌ చేశాడు. ఐపీఎల్‌ కోసం ఏర్పాటు చేసిన బయో బబుల్‌లలోని పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో తాజా సీజన్‌ను నిరవధికంగా వాయిదా వేస్తూ బీసీసీఐ మంగళవారం నిర్ణయం తీసుకుంది. 

భారత షూటర్లు కూడా... 
టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత షూటర్లతో పాటు కోచ్‌లు, అధికారులు కోవిడ్‌ వ్యాక్సిన్‌ తొలి డోస్‌ను గురువారం వేయించుకున్నారు. ఈ విషయాన్ని నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) తెలిపింది. ‘భారత షూటర్లందరూ ఈ రోజు వ్యాక్సిన్‌ తొలి డోస్‌ను వేయించుకున్నారు. కొందరు ఢిల్లీలో టీకాను తీసుకుంటే మరికొందరు వారి స్వస్థలాల్లో ఈ పనిని పూర్తి చేశారు’ అని ఎన్‌ఆర్‌ఐఏ పేర్కొంది. టోక్యో ఒలింపిక్స్‌ సన్నాహాల కోసం ఈ విశ్వక్రీడలకు అర్హత సాధించిన 15 మంది  భారత షూటర్లు క్రొయేషియాలో శిక్షణ పొందేందుకు, అక్కడ జరిగే యూరోపియన్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు ఈనెల 11న బయలుదేరాల్సి ఉంది.  

చదవండి: IPL2021: ఎప్పుడు, ఎక్కడ, ఎలా...?


 

మరిన్ని వార్తలు