Australia Vs West Indies: చెలరేగిన హెట్‌మెయిర్‌.. రెండో టీ20 కూడా విండీస్‌దే

11 Jul, 2021 16:23 IST|Sakshi

సెయింట్‌ లూసియా: ఆతిధ్య వెస్టిండీస్‌ జట్టు వరుసగా రెండో టీ20లోనూ ఆస్ట్రేలియాకు షాకిచ్చింది. తొలి మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో గెలుపొందిన కరీబియన్‌ జట్టు.. రెండో టీ20లో 56 పరుగుల తేడాతో విజయం సాధించి, 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మరో మ్యాచ్‌ గెలిస్తే విండీస్‌ సిరీస్‌ కైవసం చేసుకుంటుంది. భారతకాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 5 గంటలకు ప్రారంభమైన రెండో టీ20లో తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ నాలుగు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా పేసర్లు ఆదిలో కట్టుదిట్టంగా బంతులేయడంతో ఓపెనర్‌ ఆండ్రీ ఫ్లెచర్‌ (9), వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌ క్రిస్‌గేల్‌ (13) ఆదిలోనే ఔటయ్యారు.

అయితే మరో ఓపెనర్‌ లెండిల్‌ సిమ్మన్స్‌ (21 బంతుల్లో 30; 1x4, 3x6), మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్లు షిమ్రోన్‌ హెట్‌మెయిర్‌ (36 బంతుల్లో 61; 2x4, 4x6), బ్రావో (34 బంతుల్లో 47; 1x4, 3x6), రసెల్‌ (8 బంతుల్లో 24; 2x4, 2x6) దంచి కొట్టడంతో విండీస్‌ భారీ స్కోర్‌ సాధించగలిగింది. అనంతరం 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్‌కు విండీస్‌ బౌలర్లు చుక్కలు చూపించారు. హెడన్‌ వాల్ష్‌ 3/29, షెల్డన్‌ కాట్రెల్‌ 2/22 విజృంభించడంతో ఆ జట్టు19.2 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ మిచెల్‌ మార్ష్‌ (42 బంతుల్లో 54; 5x4, 1x6) అర్ధశతకంతో రాణించడంతో ఆస్ట్రేలియా జట్టు ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. హాఫ్‌సెంచరీతో చెలరేగిన హెట్‌మెయిర్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. ఇక ఇరు జట్ల మధ్య కీలకమైన మూడో టీ20 ఇదే వేదికగా రేపు(జులై 12) జరుగనుంది. 

మరిన్ని వార్తలు