నా ప్రేమ కొంచెం వైల్డ్‌గా ఉంటుంది : అక్తర్‌

7 Aug, 2020 10:55 IST|Sakshi

లాహోర్‌ : పాకిస్తాన్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. అయితే అప్పుడప్పుడు కొన్ని ఫన్నీ సంఘటనలను కూడా మనతో షేర్‌ చేసుకుంటాడు. తాజాగా భారత్‌ మాజీ  ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ను పొరపాటున గాయపర్చిన సంఘటనను తన యూట్యూబ్‌ చానెల్‌లో అక్తర్‌ గుర్తుచేసుకున్నాడు.

'నా ప్రేమ కొంచెం క్రూరంగా ఉంటుంది . నేను ఎవర్నయినా ప్రేమిస్తే వారిని నెడుతూ, కొడుతూ మాట్లాడుతా. నా పద్ధతిలో ప్రేమ చూపించడం అంటే అదే.  భారత్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో నేను యువరాజ్‌తో ఇలాగే ప్రవర్తించా. ప్రేమతో చేసిన పనిలో కొంచెం హద్దు మీరాను. దాంతో పొరపాటున యువరాజ్ వెన్నుకు గాయమైంది. అంతెందుకు షాహిద్‌ ఆఫ్రిదిని హత్తుకునే ప్రయత్నంలో అతన్ని కొంచెం గట్టిగా పట్టుకోవడంతో ఒక పక్కటెముక విరిగిపోవడం.. అబ్దుల్‌ రజాక్‌కు ప్రేమతో స్ట్రెచ్చింగ్‌ చేయిస్తున్న సమయంలో అనుకోకుండా నరం మెలికపడడం లాంటివి చోటుచేసుకున్నాయి. అయితే ఇదంతా ప్రేమతో సరదాకు చేసింది మాత్రమే. నేను ప్రేమను చూపించే విధానం కొంచెం వైల్డ్‌గా ఉంటుంది’ అంటూ అక్తర్ చెప్పుకొచ్చాడు. 

అయితే ఇదే అక్తర్‌ గత వారం భారత్‌ మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్‌పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. భారత్-పాకిస్తాన్‌ మధ్య జరిగిన ఒక మ్యాచ్‌లో షోయబ్‌ అక్తర్‌ అదే పనిగా స్లెడ్జింగ్‌ చేయడంతో సెహ్వాగ్‌ అతనిపై విమర్శనాలు సంధించాడు. 'అదే పనిగా బౌన్సర్లు వేస్తూ హుక్ షాట్ కొట్టమని రెచ్చగొడుతున్నాడు. దాంతో విసిగిపోయిన నేను నాన్‌స్ట్రైకర్ వైపు మీ బాబు నిలబడి ఉన్నాడు.. అతడికి చెప్పు అతడు కొట్టి చూపిస్తాడు.. నాన్‌స్ట్రైకర్‌లో సచిన్ ఉన్నాడు..’ అంటూ పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన అక్తర్‌.. ‘సెహ్వాగ్ ఒకవేళ నిజంగా ఆ మాట అని ఉంటే నేను వదిలిపెట్టేవాడినా..? కచ్చితంగా గ్రౌండ్‌లోనే చితకబాదేవాడిని. తర్వాత హోటల్‌లో కూడా కొట్టేవాడిని’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అయితే దీనిపై వీరు ఇంకా ఎటువంటి రియాక్షన్‌ ఇవ్వలేదు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా