అతడి తర్వాత మళ్లీ బుమ్రానే: అక్తర్‌

4 Jan, 2021 14:39 IST|Sakshi
షోయబ్‌ అక్తర్- మహ్మద్‌ ఆసిఫ్‌(ఫైల్‌ ఫొటోలు)

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ మాజీ సీమర్‌ మహ్మద్‌ ఆసిఫ్ బౌలింగ్‌ను ఎదుర్కోలేక సౌతాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఏబీ డివిల్లియర్స్‌ ఏడుపు లంకించుకున్నాడంటూ రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అదే విధంగా ఏషియన్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ సమయంలో టీమిండియా టెస్టు స్పెషలిస్టు వీవీఎస్‌ లక్ష్మణ్‌ సైతం ఆసిఫ్‌ బౌలింగ్‌లో ఇబ్బంది పడ్డాడని చెప్పుకొచ్చాడు. భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న నేపథ్యంలో స్టార్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా గురించి ఓ స్పోర్ట్స్‌ చానెల్‌లో మాట్లాడిన అక్తర్‌.. మహ్మద్‌ ఆసిఫ్‌ తర్వాత తాను చూసి అత్యంత స్మార్ట్‌ బౌలర్‌ బుమ్రా అంటూ కితాబిచ్చాడు. గాలివాటుని అంచనా వేసి అందుకు తగ్గట్టుగా బంతుల్ని విసిరే టెక్నిక్‌ను తాను, వసీం, వకార్‌ ఉపయోగించేవాళ్లమని, ఇప్పుడు బుమ్రా సైతం అదే తరహాలో బౌలింగ్‌ చేస్తున్నాడని పేర్కొన్నాడు. (చదవండి: గంగూలీపై ఒత్తిడి తెచ్చి వాడుకోవాలని చూస్తున్నారు!)

డివిల్లియర్స్‌ కంటతడి పెట్టాడు
‘‘పాక్‌ బౌలర్‌ మహ్మద్‌ ఆసిఫ్‌ బౌలింగ్‌లో పరుగులు చేయలేక ఏబీ డివిల్లియర్స్‌ కంటతడి పెట్టాడు. వీవీఎస్‌ లక్ష్మణ్‌ అయితే.. ‘‘ఇలాంటి బౌలర్‌ను ఎలా ఎదుర్కోవాలి’’ అని వాపోయాడు. వసీం అక్రం కంటే ఆసిఫ్‌కే ఎక్కువ భయపడేవారు. ఇప్పుడు టీమిండియా బౌలర్‌ బుమ్రాను చూస్తే నాకు అతడే గుర్తుకువస్తాడు. ఆసిఫ్‌ తర్వాత అంత స్మార్ట్‌గా బౌలింగ్‌ చేసే ఫాస్ట్‌బౌలర్‌ తను. ఫిట్‌నెస్‌ పరంగా టెస్టు క్రికెట్‌కు అతడు పనికివస్తాడా అని చాలా మంది సందేహపడేవారు. అయితే నేను గమనించింత వరకు.. ఏదైనా అనుకుంటే దానిని కచ్చితంగా సాధించాలనే పట్టుదల అతడి సొంతం. ఫాస్ట్‌బౌలర్‌గా తను పర్ఫెక్ట్‌. తనో అసాధారణ ఆటగాడు. గొప్ప బౌలర్‌. ఫిట్‌నెస్‌ సాధిస్తే సుదీర్ఘకాలం పాటు సంప్రదాయ క్రికెట్‌లో కొనసాగుతాడు’’ అని అక్తర్‌ ప్రశంసలు కురిపించాడు. కాగా బాక్సింగ్‌ డే టెస్టులో టీమిండియా విజయంలో బుమ్రా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మొత్తంగా బుమ్రా 4, అశ్విన్‌ 3, సిరాజ్‌ 2, జడేజా ఒక వికెట్‌ తీసి సత్తా చాటడంతో భారత్‌ ఆసీస్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.(చదవండి: టీమిండియానే ఈ సిరీస్‌ గెలవాలి: పాక్‌ క్రికెటర్‌)

మరిన్ని వార్తలు