మిస్బాకు ఉద్వాసన.. రేసులో అక్తర్‌?

11 Sep, 2020 11:36 IST|Sakshi

కరాచీ: పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ)లో  రెండు పదవుల్లో కొనసాగుతున్న మాజీ క్రికెటర్‌ మిస్బావుల్‌ హక్‌కు చీఫ్‌ సెలక్టర్‌ పదవికి ఉద్వానస పలకడానికి దాదాపు రంగం సిద్ధమైంది. పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు అటు ప్రధాన కోచ్‌గా, ఇటు చీఫ్‌ సెలక్టర్‌గా కొనసాగుతున్న మిస్బావుల్‌కు రెండు పదవులు అనవసరం అని ఆలోచనలో పీసీబీ ఉంది.  పాకిస్తాన్‌ జట్టు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించకపోవడంతో చీఫ్‌ సెలక్టర్‌ పదవి నుంచి తప్పించి హెడ్‌ కోచ్‌గా మాత్రమే కొనసాగించాలని పీసీబీ చూస్తోంది.  ఈ మేరకు ఇప్పటికే రంగం సిద్ధం కాగా, పాకిస్తాన్‌ చీఫ్‌ సెలక్టర్‌ రేసులోకి షోయబ్‌ అక్తర్‌ వచ్చేశాడు. ఈ మేరకు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుతో చర్చలు జరిగిన విషయాన్ని అక్తర్‌ ధృవీకరించాడు. కాకపోతే తనకు ఏ పదవి ఇస్తారో వేచి చూడాలన్నాడు.  (చదవండి: ఆసీస్‌కు అంతుచిక్కని బ్యాట్స్‌మన్‌)

‘పీసీబీతో చర్చలు జరిగిన మాట వాస్తవమే. నేను పీసీబీలో కీలక పాత్ర పోషించడానికి బోర్డుతో సంప్రదింపులు జరిపా. పీసీబీ ఆహ్వానం మేరకు చర్చలకు వెళ్లా. ఇంకా ఏమీ నిర్ణయం కాలేదు. నేను ప్రస్తుతం చాలా మంచి జీవితాన్నే గడుపుతున్నా. నేను నా క్రికెట్‌ కాలంలో ఆడా. ఇప్పుడు సెటిల్‌ అయిపోయా. ఇక పీసీబీకి సేవలందించడానికి సిద్ధంగా ఉన్నా.  నేను ఇతరులకు సలహా ఇవ్వడానికి భయపడను. నాకు అవకాశం వస్తే పాకిస్తాన్‌ క్రికెట్‌ను ప్రక్షాళన చేస్తా’ అని క్రికెట్‌ బాజ్‌ నిర్వహించిన యూట్యూబ్‌ కార్యక‍్రమంలో అక్తర్‌ తన మనసులోని మాటను వెల్లడించాడు. (చదవం‍డి: సెరెనాకు ఊహించని షాక్‌)

తమ మధ్య జరిగిన చర్చల్లో అటు బోర్డు కానీ, ఇటు తాను కానీ ఎటువంటి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదన్నాడు. ఇంకా చర్చల దశలోనే ఉన్నందను త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నాడు. క్రికెట్‌లో దూకుడైన మైండ్‌ సెట్‌తో కొత్త తరం క్రికెట్‌లో ఉండాలని అక్తర్‌ అభిప్రాయపడ్డాడు. ఇక్కడ సక్సెస్‌, ఫెయిల్యూర్‌ అనేది పక్కన పెట్టి దూకుడైన క్రికెట్‌ను ఆడాల్సి అవసరం ఉందన్నాడు. పాకిస్తాన్‌కు గత క్రికెట్‌ వైభవం తీసుకురావాలంటే తమ క్రికెటర్ల మైండ్‌ సెట్‌ మారాలన్నాడు. పాకిస్తాన్‌ దిగ్గజ క్రికెటర్లు జావేద్‌ మియాందాద్‌, వసీం అక్రమ్‌, ముస్తాక్‌ అహ్మద్‌ వంటి క్రికెటర్లు ఇలా దూకుడైన స్వభావంతోనే పాక్‌కు ఘనమైన విజయాలను అందించారన్నాడు.

>
మరిన్ని వార్తలు