Shoaib Akthar: 'అవకాశమొచ్చినా ఉపయోగించుకోరు.. అదే మన దరిద్రం'

31 Mar, 2022 19:20 IST|Sakshi

పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు షోయబ్‌ అక్తర్‌ ‍సొంతజట్టు ఆటతీరుపై మరోసారి విమర్శలు సంధించాడు. మ్యాచ్‌పై పట్టు సాధించే అవకాశం వచ్చినప్పటికి దానిని ఉపయోగించుకోలేకపోవడం మనకు మాత్రమే చెల్లిందంటూ తెలిపాడు. విషయంలోకి వెళితే.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో పాకిస్తాన్‌ ఆరంభాన్ని ఘనంగానే ఆరంభించింది. షాహిన్‌ అఫ్రిది తొలి ఓవర్‌లోనే ఆసీస్‌ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ను ఎల్బీగా పెవిలియన్‌ చేర్చాడు. కాగా ఫించ్‌కు అఫ్రిది బౌలింగ్‌లో ఇది వరుసగా రెండో గోల్డెన్‌ డక్‌ కావడం విశేషం.

ఈ గొప్ప ఆరంభాన్ని పాక్‌ బౌలర్లు వినియోగించుకోలేకపోయారు. ఆసీస్‌ ఓపెనర్‌ ట్రెవిస్‌ హెడ్‌, వన్‌డౌన్‌లో వచ్చిన బెన్‌ మెక్‌డెర్మొట్‌లు పాక్‌ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. వారికి ఏ మాత్రం అవకాశమివ్వని హెడ్‌, మెక్‌డెర్మొట్‌లు బౌండరీల వర్షం కురిపించారు. ఈ దశలోనే హెడ్‌ 89 పరుగులు చేసి ఔటవ్వగా.. మెక్‌ డెర్మోట్‌ 104 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరిద్దరి తర్వాత లబుషేన్‌ కూడా 59 పరుగులు చేయడంతో ఆసీస్‌ మరోసారి భారీ స్కోరు దిశగా పరుగులు తీసింది. 

ఈ నేపథ్యంలోనే అక్తర్‌ మరోసారి బాబర్‌ ఆజం నేతృత్వంలోని పాక్‌ జట్టును విమర్శించాడు.''ఆట ఎలా ఆడాలో ఆస్ట్రేలియాను చూసి నేర్చుకోండి. ఆ జట్టు ఆరంభంలోనే ఫించ్‌ వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత ట్రెవిస్‌ హెడ్‌, మెక్‌ డెర్మొట్‌లు ఇన్నింగ్స్‌ నడిపించిన తీరు అద్బుతం. ఈ రోజుల్లో ఒక వన్డే మ్యాచ్‌ ఎలా ఆడాలో వీరిని చూసి నేర్చుకోండి. అవకాశం వచ్చినా ఉపయోగించుకోకపోవడం మనకు అలవాటైపోయింది.. అదే మన దరిద్రం''అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఇంతకముందు కూడా అక్తర్‌ మూడో టెస్టు సందర్భంగా పాకిస్తాన్‌ ఆడిన తీరును తనదైన శైలిలో ఎండగట్టాడు.

చదవండి: AUS vs PAK: పాపం గెలవాలన్న కసి అనుకుంటా.. అందుకే గోల్డెన్‌ డక్‌

మరిన్ని వార్తలు