Shoaib Akhtar: ‘అతడికి బౌలింగ్‌ చేయడం కష్టంగా అనిపించేది’

13 Jul, 2021 11:26 IST|Sakshi

ఇస్లామాబాద్‌: తన కెరీర్‌లో అద్భుతమైన బంతులు సంధించి ఎంతో మంది బ్యాట్స్‌మెన్‌కు నిద్రలేని రాత్రులు మిగిల్చాడు ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌’, పాక్‌ మాజీ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌. పదునైన బౌన్సర్లు, యార్కర్లతో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు చుక్కలు చూపించేవాడు. అంతటి ‘భీకరమైన’ బౌలర్‌ను ఎక్కువగా ఇబ్బంది పెట్టిన ‘బ్యాట్స్‌మెన్‌’ ఎవరో తెలుసా? శ్రీలంక లెజెండరీ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ అట. ఈ విషయాన్ని అక్తర్‌ స్వయంగా వెల్లడించాడు.

స్వతహాగా మేటి బౌలర్‌ అయిన ముత్తయ్య.. తన కెరీర్‌లో ఎక్కువగా పదకొండో స్థానంలోనే బ్యాటింగ్‌కు దిగేవాడు. అలాంటి లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ను ఎదుర్కోవడం అక్తర్‌కు అసలు లెక్కే కాదు. ఈ విషయాల గురించి అక్తర్‌ మాట్లాడుతూ... ‘‘నేను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బ్యౌట్స్‌మెన్‌ ముత్తయ్య మురళీధరన్‌. ఇదేమీ జోక్‌ కాదు. నిజమే చెబుతున్నా. ‘నేనసలే బక్కపల్చని వాడిని. నీ బౌన్సర్లతో నన్ను కొట్టిచంపకు.. ప్లీజ్‌.. నువ్వు బంతి నెమ్మదిగా విసిరితే.. నేను వికెట్‌ సమర్పించుకుంటా’ అని బతిమిలాడేవాడు.

సరేలే అని అలాగే చేస్తే భారీ షాట్‌ ఆడి.. ఏదో పొరపాటులో అలా జరిగిపోయింది అని చెప్పేవాడు’’ అని వ్యాఖ్యానించాడు. ఇక సమకాలీన క్రికెటర్లలో విరాట్‌ కోహ్లి, బాబర్‌ ఆజం, బెన్‌ స్టోక్స్‌ వికెట్‌ తీసే అవకాశం వస్తే బాగుంటుందని అక్తర్‌ చెప్పుకొచ్చాడు. ఇక పీఎస్‌ఎల్‌ లేదా ఐపీఎల్‌.. ఏ లీగ్‌లో ఆడటానికి ఇష్టపడతారనే ప్రశ్నకు బదులుగా.. ‘మాతృ దేశం మీద ప్రేమతో పాకిస్తాన్‌ లీగ్‌, డబ్బు కోసమైతే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌’ ఆడతానని తనదైన శైలిలో కామెంట్‌ చేశాడు.

>
మరిన్ని వార్తలు