భారత్‌కు ఆక్సిజన్‌ అందిద్దాం.. షోయబ్‌ అక్తర్‌ పిలుపు

25 Apr, 2021 16:50 IST|Sakshi

ఇస్లామాబాద్‌: భారత్‌లో కరోనా మహామ్మారి కరాళ నృత్యం చేస్తున్న వేళ, జీవ వాయువు కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఆక్సిజన్‌ కొరతతో దేశ రాజధాని ఢిల్లీతో సహా యావత్‌ భారత దేశంలో కరోనా రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో దాయది దేశం పాక్‌ అండగా నిలుస్తామంటూ ముందుకు రావడం శుభపరిణామం. ఈ విషయమై పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఇటీవలే ఓ ప్రకటన విడుదల చేయగా, తాజాగా ఆ దేశ మాజీ క్రికెటర్‌ షోయ‌బ్ అక్త‌ర్ ఓ వీడియో సందేశాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఈ వీడియోలో అక్తర్‌.. భారత్‌కు ఆక్సిజన్‌ సాయం చేద్దామంటూ పిలుపునిచ్చాడు. 

ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కోవ‌డం ఏ ప్ర‌భుత్వానికైనా అసాధ్య‌మేనని ఆయన అభిప్రాయపడ్డాడు. మహమ్మారిపై పోరాటంలో భాగంగా భారత్‌కు తమ వంతు సాయంగా జీవవాయువును అందించాలని పాక్‌ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాడు. భారత్‌లో ఆక్సిజన్‌ కొరత పతాక స్థాయికి చేరిన నేపథ్యంలో, పాక్‌ అభిమానులు విరాళాలు సేకరించి భారత్‌కు ఆక్సిజ‌న్ ట్యాంకులు అందించాల‌ని పిలపునిచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అక్తర్‌ సందేశం పట్ల భారత్‌, పాక్ అభిమానుల‌ను ఫిదా అవుతున్నారు. అక్తర్‌ సహృదయంతో ఇచ్చిన పిలుపుకు భారత సెలబ్రిటీలు సైతం అభినందిస్తున్నారు. కాగా, గతేడాది కరోనా సమయంలో కూడా భారత్‌కు సాయం చేయాలని అక్తర్‌ ప్ర‌పంచ దేశాల‌కు విజ్ఞప్తి చేశాడు.
చదవండి: పాక్‌కు షాకిచ్చిన జింబాబ్వే

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు