స‌చిన్ నీకు ప్ర‌త్య‌ర్థి ఏంటి.. అక్త‌ర్ ట్వీట్‌పై నెటిజన్ల ఆగ్రహం

1 Apr, 2021 15:58 IST|Sakshi

ముంబై: ఇటీవల ముగిసిన రోడ్‌ సేఫ్టీ ప్రపంచ సిరీస్‌లో పాల్గొన్న మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అతనితో పాటు భారత లెజెండ్స్‌ సభ్యులు బ‌ద్రీనాథ్‌, యూసుఫ్ ప‌ఠాన్‌, ఇర్ఫాన్ ప‌ఠాన్‌ల‌కు కూడా వైరస్‌ నిర్ధారణ అయ్యింది. వీరందరూ ప్రస్తుతం హోం క్వారెంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మాస్టర్‌ బ్లాస్టర్‌ స‌చిన్ త్వ‌ర‌గా కోలువాలంటూ పాక్‌ మాజీ స్పీడ్‌స్టర్‌ షోయ‌బ్ అక్త‌ర్ ట్వీట్ చేశారు. మైదానంలో త‌న ఫేవ‌రేట్ ప్ర‌త్య‌ర్థి అయిన స‌చిన్‌ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అక్త‌ర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే అక్తర్‌.. స‌చిన్ త‌న‌కు ప్ర‌త్య‌ర్థి అంటూ ట్వీట్ చేయ‌డం ప‌ట్ల కొంద‌రు నెటిజ‌న్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

నువ్వు సాధారణ ఫాస్ట్ బౌల‌ర్‌వి మాత్ర‌మే, ఎంతో మంది మేటి బౌల‌ర్ల‌ను స‌చిన్ సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడని ఓ నెటిజ‌న్ అక్త‌ర్‌ను ట్రోల్ చేయగా.. వ‌కార్ యూనిస్, వ‌సీం అక్ర‌మ్, ఆంబ్రోస్‌, మెక్‌గ్రాత్‌, అలెన్‌ డొనాల్డ్‌‌ లాంటి దిగ్గజ ఫాస్ట్‌ బౌలర్లకే స‌చిన్ చుక్కలు చూపించాడని మరో అభిమాని పేర్కొన్నాడు. స‌చిన్ నీకు ప్ర‌త్య‌ర్థి ఏంటి.. వ‌కార్‌, అక్ర‌మ్‌ లాంటి దిగ్గజాలు ఆమాటంటే ఓ అర్ధముందంటూ మ‌రో అభిమాని అక్త‌ర్‌ను ట్రోల్ చేశాడు. 2003 వన్డే ప్రపంచకప్‌లో అక్రమ్‌, వకార్‌లతోపాటు సచిన్‌.. నీకు కూడా చుక్కలు చూపించిన విషయాన్ని మర్చిపోయావా అంటూ పలువురు అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా అక్తర్‌పై విరుచుకుపడ్డారు. కాగా, మార్చి 27న త‌న‌కు క‌రోనా సంక్ర‌మించిన‌ట్లు స‌చిన్ ట్విట్ట‌ర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. 
చదవండి: కరోనా కలకలం.. 30 మంది అథ్లెట్లకు పాజిటివ్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు