షోయబ్‌ మాలిక్‌ కారుకు యాక్సిడెంట్‌

11 Jan, 2021 10:02 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ సీనియర్‌ క్రికెటర్‌, భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా భర్త షోయబ్‌ మాలిక్‌ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆయన నడుపుతున్న స్పోర్ట్స్‌ కారు అదుపుతప్పింది. లాహోర్‌లో జాతీయ రహదారికి సమీపంలోని ఓ రెస్టారెంటు వద్ద ఆగి ఉన్న ట్రక్కును ఆదివారం ఢీకొట్టింది. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌)- 2021 టీర్నీకి సంబంధించిన సన్నాహకాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై తిరిగి వస్తున్న అనంతరం ఈ ఘటన చోటుచేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

కాగా ఈ ప్రమాదంలో తాను స్వల్ప గాయాలతో బయటపడినట్లు షోయబ్‌ మాలిక్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించారు. ఈ మేరకు... ‘‘రోడ్డు ప్రమాదం జరిగింది. నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. కానీ భగవంతుడి దయ వల్ల అంతా సవ్యంగానే ఉంది. నాకోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు. మీరు చూపిస్తున్న ప్రేమకు నేను కృతజ్ఞుడినై ఉంటాను’’ అని షోయబ్‌ ట్వీట్‌ చేశారు. కాగా సానియా మీర్జా- షోయబ్‌ మాలిక్‌ ఏప్రిల్‌ 12, 2008న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి 2018లో కుమారుడు ఇజహాన్ జన్మించాడు.(చదవండి: 'ఛీ.. స్కూల్‌ లెవల్‌ కన్నా దారుణం' )

ఇక షోయబ్‌ కెరీర్‌ విషయానికొస్తే.. పాకిస్తాన్‌ తరఫున 35 టెస్టులు, 287 వన్డేలు, 116 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఇప్పట్లో రిటైర్‌ అయ్యే ఆలోచన తనకు లేదని ఇటీవలే వెల్లడించిన అతడు‌.. పీఎస్‌ఎల్‌లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఫిబ్రవరి 20- మార్చి 22 వరకు కరాచీలో ఈ టోర్నీ నిర్వహించనున్నారు.  కరాజీ కింగ్స్‌, క్వెట్టా గ్లాడియేటర్స్‌ మధ్య తొలి మ్యాచ్‌ జరుగనుంది.

మరిన్ని వార్తలు