Abhinav Bindra: 34 ఏళ్లకే ఎందుకు రిటైర్మెంట్‌?.. మూడు ముక్కల్లో సమాధానం

12 Aug, 2022 17:10 IST|Sakshi

అభినవ్‌ బింద్రా.. ఈ పేరు చెప్పగానే మొదటగా గుర్తుకువచ్చేది 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో షూటింగ్‌ విభాగంలో గెలుచుకున్న స్వర్ణ పతకం. ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో భారత్‌కు స్వర్ణం అందించిన తొలి అథ్లెట్‌గా అభినవ్‌ బింద్రా చరిత్ర లిఖించాడు. అందుకే క్రీడాభిమానులు అంత తొందరగా అభివన్‌ బింద్రా పేరు మరిచిపోలేరు. 10 మీటర్ల రైఫిల్ షూటింగ్ ఈవెంట్‌లో విజయం సాధించి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. కాగా 2017లో 34 ఏళ్ల వయసులోనే బింద్రా అధికారికంగా షూటింగ్‌ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు. అయితే తన రిటైర్మెంట్‌కు ముందు జరిగిన 2016 రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్నప్పటికి అభినవ్‌ బింద్రా పతకం సాధించలేకపోయాడు.

తాజాగా బర్మింగ్‌హమ్‌ వేదికగా జరిగిన 22వ కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ ప్రదర్శనపై ప్రశంసలు కురిపించాడు. ఈసారి గేమ్స్‌లో 61 పతకాలు సాధించిన భారత్‌ నాలుగో స్థానంలో నిలిచింది. ఇండియా ఖాతాలో 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే  బింద్రా స్పందించాడు.'' కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లకు శుభాకాంక్షలు. ఈసారి పతకాలు సాధించిన వారిలో ఎక్కువమంది అథ్లెట్ల జీవితాలు అందరికి ఆదర్శప్రాయం కావడం జాతికే గర్వకారణం. మనందరం భారతీయులం.. ఈ విజయాన్ని ఆస్వాదిద్దాం'' అంటూ పేర్కొన్నాడు.

కాగా బింద్రా ట్వీట్‌ చేసిన కొద్ది నిమిషాలకే ఒక అభిమాని.. మీరు తొందరగా రిటైర్‌ అవ్వడానికి గల కారణాలు ఏంటో చెబుతారా అని అడిగాడు. దానికి బింద్రా మూడు ముక్కల్లో ముగించాడు. '' (1).. నా నైపుణ్యం కాస్త మసకబారినట్లుగా అనిపించింది.. (2).. ఒకసారి పతకం తెచ్చాను.. ఇంకోసాది దేశానికి పతకం తేవాలన్న నా కళ ఫెయిల్‌ అయింది.. (3).. 34 ఏళ్ల వయసులో రిటైర్మెంట్‌ ఇచ్చానంటే కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వడం కోసమే. ఈ రోజుల్లో మన భారత్‌లో యంగ్‌ టాలెంట్‌ విరివిగా ఉంది.. ప్రోత్సహించడమే మన లక్ష్యం.. దానిని పాడు చేయొద్దు.. అందుకే గౌరవంగా తప్పుకున్నా'' అంటూ ట్వీట్‌ చేశాడు.

చదవండి: టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి నైనా జైశ్వాల్‌కు వేధింపులు

మరిన్ని వార్తలు