Mohammed Rizwan: వరల్డ్‌కప్‌లో భారత్‌ను ఓడించినప్పటి నుంచి నాకు అన్ని ఫ్రీ..!

15 Dec, 2022 21:45 IST|Sakshi

స్వదేశంలో ఇంగ్లండ్‌ చేతిలో 0-2 తేడాతో టెస్ట్‌ సిరీస్‌ కోల్పోయిన అనంతరం పాకిస్తాన్‌ స్టార్‌ ఓపెనర్‌, వికెట్‌కీపర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రిజ్వాన్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ఇంగ్లండ్‌తో సిరీస్‌ గురించి అనుకుంటే పొరపాటు పడ్డట్టే. రిజ్వాన్‌ మాట్లాడింది టీమిండియాను ఉద్దేశించి.

స్కై స్పోర్ట్స్‌ ఛానల్‌లో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైక్‌ ఆథర్టన్‌తో రిజ్వాన్‌ మాట్లాడుతూ.. టీ20 వరల్డ్‌కప్‌-2021లో టీమిండియాపై విజయం తన జీవితాన్ని మార్చేసిందని పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌ చేతిలో ఎదురైన ఘోర పరాభవాన్ని సైతం పక్కకు పెట్టిన రిజ్వాన్‌.. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. వరల్డ్‌కప్‌లో భారత్‌పై విజయం సాధించిన నాటి నుంచి స్వదేశంలో తనకు మర్యాద విపరీతంగా పెరిగిపోయిందని, తాను షాపింగ్‌కు ఎక్కడికి వెళ్లినా షాప్‌ యజమానులు తన వద్ద డబ్బులు తీసుకోవట్లేదని తెలిపాడు.

ఇండియాను ఓడించావు.. అది చాలు, మాకు డబ్బులు వద్దు.. నీకు అన్నీ ఫ్రీ అంటూ షాప్‌కీపర్లు తెగ మెహమాట పెట్టేస్తున్నారని చెప్పుకొచ్చాడు. తానైతే టీమిండియాపై గెలుపును ఓ సాధారణ గెలుపులానే భావించానని, స్వదేశానికి వెళ్లాక ఆ గెలుపు ప్రత్యేకతేంటో తనకు తెలిసి వచ్చిందని అన్నాడు. 

కాగా, టీ20 వరల్డ్‌కప్‌-2021 తొలి మ్యాచ్‌లో టీమిండియాపై పాకిస్తాన్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ పాక్‌కు 152 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా.. రిజ్వాన్‌ (55 బంతుల్లో 79 నాటౌట్‌), బాబర్‌ ఆజమ్‌ (52 బంతుల్లో 68 నాటౌట్‌) అజేయ అర్ధశతకాలతో తమ జట్టును గెలిపించుకున్నాడు. 

మరిన్ని వార్తలు