7 పరుగులకే ఆలౌట్‌.. ఇందులోనూ మూడు ఎక్స్‌ట్రాలు

11 Jul, 2021 18:49 IST|Sakshi

లండన్‌: యార్క్‌షైర్‌ ప్రీమియర్‌ టీ10 లీగ్‌లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్‌లో అత్యంత చెత్త గణాంకాలు నమోదయ్యాయి. ఈస్ట్‌రింగ్‌స్టన్‌ క్లబ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో.. హిల్లమ్‌ మాన్క్‌ ఫ్రైస్టన్‌ జట్టు 8 ఓవర్లలో 7 పరుగులకే ఆలౌటై అప్రతిష్ట మూటగట్టుకుంది. అనంతరం స్వల్ప ఛేదనలో ప్రత్యర్ధి జట్టు కేవలం 8 బంతుల్లోనే వికెట్‌ నష్టపోకుండా లక్ష్యాన్ని చేరుకుని 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్‌.. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో, అత్యంత తక్కువ బంతుల్లో పూర్తయిన మ్యాచ్‌గా చరిత్రలో నిలిచింది. ఈ మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌లు కేవలం 56 బంతుల్లోనే ముగిసిపోయాయి. 

తొలుత బ్యాటింగ్‌కు దిగిన హిల్లమ్‌ మాన్క్‌ ఫ్రైస్టన్‌ జట్టు.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఏదో పని ఉందన్నట్లుగా క్రీజులోకి వచ్చీరాగానే వికెట్లు సమర్పించుకుని పెవిలియన్‌కు చేరారు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 10మంది బ్యాట్స్‌మెన్‌ బ్యాటింగ్‌ చేయగా, 8 మంది ఖాతా తెరవకుండానే ఔటయ్యారు. మిగిలిప ఇద్దరు ఆటగాళ్లు అతికష్టం మీద తలో రెండు పరుగులు చేయగా, మిగిలిన మూడు పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. దీంతో ఫ్రైస్టన్‌ జట్టు 8 ఓవర్లలో 7 పరుగులకు ఆలౌటైంది. ప్రత్యర్ధి బౌలర్ నాథన్ క్రీగర్ 4 ఓవర్లలో 3 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు.

అనంతరం 8 పరుగులు స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్ట్‌రింగ్‌స్టన్‌ జట్టు.. కేవలం 1.2 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా టార్గెట్‌ను రీచ్‌ కావడంతో ఏ ఫార్మాట్టోనైనా అత్యంత తక్కువ సమయంలో, అత్యంత తక్కువ బంతుల్లో ముగిసిన మ్యాచ్‌గా ఈ మ్యాచ్‌ చరిత్రకెక్కింది. ఈస్ట్‌రింగ్‌స్టన్‌ ఆటగాడు జేమ్స్ ఒక్కడే 8 బంతులను ఎదుర్కొని బౌండరీ సాయంతో 7 పరుగులు సాధించాడు. మరో పరుగు ఎక్స్‌ట్రాగా లభించింది.

మరిన్ని వార్తలు