IPL 2021: ఐపీఎల్‌ రద్దు తప్పదా?

3 May, 2021 15:50 IST|Sakshi

అహ్మదాబాద్‌: గత కొన్ని రోజులుగా ఐపీఎల్‌-14 సీజన్‌ను రద్దు చేయాలనే డిమాండ్‌ ఎక్కువగా వినిపిస్తోంది. భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఐపీఎల్‌ అవరసరమా అనే వాదన తెరపైకి వచ్చింది. ఐపీఎల్‌ ద్వారా ఎంటైర్‌టైన్‌మెంట్‌ లభిస్తున్నా ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ టోర్నీని రద్దు చేస్తేనే మంచిదని ఎక్కువశాతం అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్‌లో పాల్గొంటున్న పలువురు క్రికెటర్లలో కూడా రద్దు చేస్తేనే మంచిదని తలంపుతో ఉన్నారు. కానీ పైకి మాత్రం ఏమీ మాట్లాలేకపోతున్నారు. కాకపోతే రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు సభ్యుడు ఆండ్రూ టై మాత్రం తన గళాన్ని బలంగానే వినిపించాడు. తాను ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఆడలేనని ప్రకటించి టోర్నీకి గుడ్‌ బై చెప్పాడు. అదే సమయంలో కరోనా వైరస్‌తో భారత్‌ విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుంటే వేల కోట్లు ఖర్చు పెట్టి ఐపీఎల్‌ను నిర్వహించడం అవసరమా అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌ ద్వారా ఎంతటి వినోదాన్ని పంచినా దేశం ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్య ముందు అది అవసరం లేదని తేల్చిచెప్పాడు. 

ఒకవైపు ఐపీఎల్‌ ఆడే క్రికెటర్లు సుదీర్ఘ బయోబబుల్‌ ఉండాల్సి రావడంతో పలువురు క్రికెటర్లు ఈ టోర్నీని వీడారు. ఇది తమవల్ల కాదంటూ ఆడమ్‌ జంపా, రిచర్డ్‌సన్‌, ఆండ్రూ టై, లివింగ్‌స్టోన్‌ తదితరులు తమ  దేశాలకు వెళ్లిపోయారు. ఇక రవిచంద్రన్‌ అశ్విన్‌ కూడా తన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడాడు. అశ్విన్‌ కుటుంబంలో తల్లిదండ్రులకు కరోనా రావడంతో అతను ఉన్నపళంగా టోర్నీని వదిలేశాడు. ఈ సెగ అంపైర్లు, మ్యాచ్‌ రిఫరీలకు కూడా తాకింది.  భారత్‌కు చెందిన అంపైర్‌ నితిన్‌ మీనన్‌ కూడా ఇంటికి వెళ్లిపోయారు. మీనన్‌ తల్లికి, భార్యకు కరోనా పాజిటివ్‌ రావడంతో వారితో ఉండటం కోసం మీనన్‌ టోర్నీ నుంచి వైదొలిగారు.  ఆస్ట్రేలియాకు చెందిన అంపైర్‌ పాల్‌ రీఫెల్‌ కూడా ఐపీఎల్‌ నుంచి తప్పుకోవడానికి యత్నించారు. కాగా, అప్పటికి విమానరాకపోకల నిషేధం అమల్లోకి  రావడంతో రిఫెల్‌ వెళ్లలేకపోయారు. 

ఐపీఎల్‌ మ్యాచ్‌ రిఫరీగా వ్యవహరిస్తున్న మను నయ్యర్‌ బయో బబుల్‌ను వీడి స్వస్థలం న్యూఢిల్లీకి వెళ్లిపోయారు. ఆయన తల్లి హఠాన్మరణమే అందుకు కారణం. కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో మను నయ్యర్‌ మళ్లీ టోర్నీకి తిరిగి వస్తారా అన్న అంశంపై స్పష్టత లేదు.  తాజాగా కోల్‌కలా జట్టు ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయింది. ఆ జట్టులోని ఇద్దరు ఆటగాళ్లు వరుణ్‌ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌లకు కరోనా వైరస్‌ సోకినట్లు తేలడంతో కేకేఆర్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లకతప్పలేదు.  అదే సమయంలో మే3వ తేదీన ఆర్సీబీ-కేకేఆర్‌ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను వాయిదా వేశారు. బయోబబుల్‌ వాతావరణంలో ఐపీఎల్‌ను నిర్వహిస్తున్నా భయంభయంగానే ఈ టోర్నీ జరుగుతుంది. ఇప్పటికి సగం మ్యాచ్‌లు మాత్రమే పూర్తి కాగా, ఇంకా దాదాపు సగం టోర్నీ మిగిలి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఐపీఎల్‌ను రద్దు చేయాలనే వాదన మరోసారి ఊపందుకుంది. 

ఇక్కడ చదవండి: 
ఇద్దరు ప్లేయర్లకు కరోనా, నేటి మ్యాచ్‌ వాయిదా!

వార్నర్‌ వద్దా.. ఒక్క ఓవర్‌ బౌలర్‌ కావాలా?

మరిన్ని వార్తలు