ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ దూరం.. ఐపీఎల్‌కు కూడా..!

12 Mar, 2023 21:48 IST|Sakshi

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు అతి భారీ షాక్‌ తగిలింది. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌ సందర్భంగా గాయపడిన టీమిండియా స్టార్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ సిరీస్‌ మొత్తానికే దూరం కానున్నాడని తెలుస్తోంది.

గత కొంతకాలంగా వెన్నునొప్పి సమస్యతో బాధపడుతూ, శస్త్ర చికిత్స సైతం చేయించుకున్న అయ్యర్‌.. అహ్మదబాద్‌ టెస్ట్‌ సందర్భంగా గాయం తిరగబెట్టడంతో తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు కూడా దిగలేదు. మూడో రోజు ఆట సందర్భంగా అయ్యర్‌ వెన్నునొప్పితో విలవిల్లాడిపోయాడని సమాచారం. ప్రస్తుతం అయ్యర్‌ బీసీసీఐ వైద్యబృందం పర్యవేక్షణలో ఉన్నాడు.

స్కానింగ్‌ రిపోర్టులు అధికారికంగా వెలువడే వరకు ఎలాంటి ప్రకటన చేయకూడని బీసీసీఐ అధికారుల బృందానికి క్లియర్‌ గైడ్‌ లైన్స్‌ ఉన్నాయని తెలుస్తోంది. ఒకవేళ అయ్యర్‌ గాయం తీవ్రత అధికంగా ఉంటే, ఆసీస్‌తో వన్డే సిరీస్‌తో పాటు ఐపీఎల్‌-2023కు కూడా దూరమయ్యే అవకాశముందని భారత క్రికెట్‌ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతుంది. కాగా, మార్చి 17 నుంచి ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో శ్రేయస్‌ అయ్యర్‌ కీలక సభ్యుడిగా ఉన్నాడు. 

ఇదిలా ఉంటే, అహ్మదాబాద్‌ టెస్ట్‌ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 3 పరుగులు పరుగులు చేసి, భారత తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 88 పరుగులు వెనుకపడి ఉంది. ట్రవిస్‌ హెడ్‌ (3), మాథ్యూ కుహ్నేమన్‌ (0) క్రీజ్‌లో ఉన్నారు. 

అంతకుముందు భారత ఇన్నింగ్స్‌లో కోహ్లి (186)తో పాటు శుభ్‌మన్‌ గిల్‌ (128) సెం‍చరీ చేయగా..  అక్షర్‌ పటేల్‌ (79) మెరుపు అర్ధసెంచరీతో అలరించాడు. దానికి ముందు ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 482 పరుగులకు ఆలౌటైంది. 

ఉస్మాన్‌ ఖ్వాజా (180), గ్రీన్‌ (114) సెంచరీలతో కదం‍తొక్కగా.. అశ్విన్‌ 6 వికెట్లతో ఆసీస్‌ వెన్ను విరిచాడు. ఆసీస్‌ బౌలర్లలో లియోన్‌, మర్ఫీ తలో 3 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్‌, కుహ్నేమన్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.   

మరిన్ని వార్తలు