IND Vs AUS: తొలి టెస్టుకు శ్రేయాస్‌ అ‍య్యర్‌ దూరం.. జడ్డూ రీఎంట్రీ

1 Feb, 2023 08:31 IST|Sakshi

టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి టెస్టుకు దూరమయ్యాడు. వెన్నునొప్పి గాయంతో బాధపడుతున్న అయ్యర్‌ ఇంకా పూర్తిగా కోలుకోలేదని.. అందుకే తొలి టెస్టుకు అతను దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో శ్రేయాస్‌ అయ్యర్‌ స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌ టెస్టు అరంగేట్రం చేయడం గ్యారంటీగా కనిపిస్తుంది.  

అయితే కివీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కు ముందే గాయంతో బాధపడిన అయ్యర్‌ను సిరీస్‌ నుంచి పక్కకు తప్పించిన బీసీసీఐ బెంగళూరులోని ఎన్‌సీఏ అకాడమీకి పంపించారు. ప్రస్తుతం ఎన్‌సీఏలో ఉన్న అయ్యర్‌ రోజు ఇంజెక్షన్‌ తీసుకుంటున్నప్పటికి నడుము కింది భాగంలో ఇంకా నొప్పి ఉన్నట్లు తేలింది. దీంతో ఎన్‌సీఏ అయ్యర్‌కు కనీసం రెండు వారాలు విశ్రాంతి అవసరం అని తెలిపింది.

దీంతో శ్రేయాస్‌ అయ్యర్‌ ఆసీస్‌తో తొలి టెస్టుకు దూరమైనట్లు బీసీసీఐ అధికారికంగా పేర్కొంది. అయితే ఫిట్‌నెస్‌ రిపోర్ట్‌ ఆధారంగా అయ్యర్‌ రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడా లేదా అనేది తెలుస్తుందని అభిప్రాయపడింది. అయ్యర్‌ స్థానంలో సూర్యకుమార్‌ జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. యాక్సిడెంట్‌ కారణంగా రిషబ్‌ పంత్‌ కూడా జట్టుకు దూరం కావడంతో ఐదో స్థానంలో సూర్యకుమార్‌ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది.

జడ్డూ ఈజ్‌ బ్యాక్‌
టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి టెస్టుకు జట్టుతో పాటు జాయిన్‌ కానున్నాడు. ఈ మేరకు జడేజా ఫిట్‌నెస్‌ టెస్టు క్లియర్‌ చేసినట్లు బీసీసీఐ తెలిపింది. ఇప్పటికే దేశవాళీ టోర్నీ రంజీలో సౌరాష్ట్ర తరపున బరిలోకి దిగిన జడేజా పూర్తి ఫిట్‌నెస్‌తో కనిపించాడు. మ్యాచ్‌లో 41 ఓవర్లు బౌలింగ్‌ చేసి ఏడు వికెట్లు కూడా తీశాడు. బ్యాటింగ్‌లోనూ పర్వాలేదనిపించాడు.

అతని ప్రదర్శనతో సౌరాష్ట్ర క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకుంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ సందర్భంగా మోకాలి గాయంతో బాధపడిన జడ్డూ సర్జరీ అనంతరం ఎన్‌సీఏ రిహాలిటేషన్‌లో గడిపాడు. ఈ నేపథ్యంలోనే టి20 వరల్డ్‌కప్‌తో పాటు ఆసియాకప్‌కు దూరమయ్యాడు. తాజాగా అతని రీఎంట్రీతో టీమిండియా బలం పెరిగినట్లయింది. భారత్‌లో ఉండే స్పిన్‌ పిచ్‌లపై జడేజా చాలా ప్రభావం చూపించగలడు. 

ఆస్ట్రేలియా భారత పర్యటన షెడ్యూల్‌: ఫిబ్రవరి 09- మార్చి 22.. టెస్టు సిరీస్‌తో ప్రారంభం- వన్డే సిరీస్‌తో ముగింపు

నాలుగు టెస్టుల సిరీస్‌
► ఫిబ్రవరి 9- 13: నాగ్‌పూర్‌
► ఫిబ్రవరి 17- 21: ఢిల్లీ
► మార్చి 1-5: ధర్మశాల
► మార్చి 9- 13: అహ్మదాబాద్‌

3 వన్డేల సిరీస్‌
► మార్చి 17- ముంబై
► మార్చి 19- వైజాగ్‌
► మార్చి 22- చెన్నై 

చదవండి: టీమిండియాతో తొలి టెస్టు.. ఆస్ట్రేలియాకు బిగ్‌ షాక్‌! ఇక కష్టమే

మరిన్ని వార్తలు